దేశంలో ఉన్న 130 కోట్ల జనాభా నేటి సాయంత్రం ఓ బృహత్ కార్యాన్ని చేపట్టబోతోంది. ప్రశాంతంగా సాగుతున్న ప్రజల జీవనాన్ని స్తంభింపజేసిన ఓ అదృశ్య శక్తిపై పోరాడేందుకు తామంతా ఒక్కటే అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వబోతోంది. కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొడతామనే సంకల్పాన్ని చాటిచెప్పబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించనుంది యావత్ భారతం.
ఎందుకు లైట్లు ఆర్పాలి?
దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు 21 రోజుల లాక్డౌన్ విధించిన అనంతరం తొలిసారి దేశ ప్రజలనుద్దేశించి వీడియో సందేశమిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. జనతా కర్ఫ్యూతో భారతీయులు తమ శక్తిసామర్థ్యాలు చాటారని కొనియాడి, ప్రజలంతా ఏకమై భారత్లో కరోనాను తరిమికొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లేనని పునరుద్ఘాటించారు. ఈ ఆదివారం రాత్రి లైట్లన్నీ ఆపేసి కేవలం కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించి, సరిగ్గా 9 గంటలకు మొదలుపెట్టి 9 నిమిషాలపాటు దీన్ని కొనసాగించాలన్నారు మోదీ. ఇలా చేయడం సంకట సమయంలో భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.
130 కోట్లమంది భారతీయుల సంకల్పంతో మనమేంటో రుజువు చేసేందుకు లైట్లు ఆర్పి ప్రధాని పిలుపును విజయవంతం చేయాలి.
బయటకు రావొచ్చా?
ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అలా చేస్తే కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే గడప దాటకుండా ఇంట్లోనే లైట్లన్నీ ఆర్పి, కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించాలి. కుదరకపోతే మొబైల్ ఫ్లాష్, టార్చ్లైట్లను ఉపయోగించాలి. ఈ సమయంలో సామాజిక దూరం కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి. ఇంటి గడపనే లక్ష్మణ రేఖగా భావించాలి. అడుగు బయటపెట్టకూడదు.
విద్యుత్ పరికరాలు అన్నీ ఆపేయాలా?
లేదు. మన ఇంట్లోని లైట్లు మాత్రమే ఆర్పివేయాలి. వీధి లైట్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లను యథావిధిగా పనిచేయనివ్వాలి.