తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇవి రోగ నిరోధక శక్తిని అందించే వస్త్రాలు - ఆయుర్వేద కళాశాల

వ్యాధుల బారినుంచి రక్షించుకోవడానికి రోగ నిరోధక శక్తి ఎంతో కీలకం. ఇందుకోసం.. సరైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అయితే.. తాము తయారు చేసిన వస్త్రాలను ధరించినా.. రోగ నిరోధక శక్తి అందుతుందని అంటున్నారు మధ్యప్రదేశ్​లోని టెక్స్​టైల్​ నిపుణులు. అందుకే.. వీళ్లు రూపొందించిన చీరలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

etv bharat special story about madhyapradesh bhopal ayurvstra which improves immune power
ఇవి రోగ నిరోధక శక్తిని అందించే వస్త్రాలు

By

Published : Dec 4, 2020, 7:51 AM IST

ఇవి రోగ నిరోధక శక్తిని అందించే వస్త్రాలు

రాజసానికీ, నవాబీ దర్పానికి అద్దంపట్టే మధ్యప్రదేశ్​లోని భోపాల్​ నగరం.. మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. రోగనిరోధక శక్తి పెంచే చీరల తయారీని ఇక్కడి హ్యాండ్‌లూమ్స్, హ్యాండ్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్ చేపట్టింది. ఔషధ గుణాలున్న మూలికలలో వస్త్రాన్ని నానబెట్టడం ద్వారా ఈ చీరలు తయారు చేస్తున్నారు. వీటికి ఆయుర్వస్త్రాలని పేరుపెట్టారు.

"రోగనిరోధకశక్తిని పెంచే ఔషధ మూలికలతో ఈ వస్త్రాలు తయారవుతాయి. ముందుగా మూలికల్లో వాటిని నానబెడతారు. దాల్చిని, జాజికాయ, యాలకులు, నల్లమందు, లవంగాలు, అనాస పువ్వులాంటి సుగంధ ద్రవ్యాలను మిశ్రమంగా చేసి, 48 గంటలపాటు నానబెడతారు. ఆవిరి పట్టే ప్రక్రియ తర్వాత ఆ వస్త్రాలు ఔషధ దుస్తులుగా మారతాయి."

--వినోద్ మలేవర్, టెక్స్‌టైల్ రంగ నిపుణుడు

ఒక్క చీరకు 5 నుంచి 6 రోజులు..

హ్యాండ్‌లూమ్స్‌, హ్యాండిక్రాఫ్ట్స్ విభాగం సలహా మేరకు టెక్స్‌టైల్ నిపుణులు ఈ చీరలు రూపొందించారు. చీరల తయారీలో సుగంధ ద్రవ్య మూలికలు వినియోగించి, వందల ఏళ్ల నాటి పురాతన పద్ధతులను అనుసరించారు. తర్వాత ఔషధ విలువలున్న నీటి ఆవిరి పట్టేలా కొన్ని గంటల పాటు ఉంచుతారు. అలా ఆయుర్వస్త్రాలు తయారవుతాయి. ఒక్కచీరను తయారు చేసేందుకు 5 నుంచి 6 రోజుల సమయం పడుతుంది.

"సూక్ష్మ స్థాయిలో ప్రభావం చూపే నూనెలు వీటిలో ఉంటాయి. కాబట్టి, ఒంటిపై ధరించినప్పుడు తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ చర్మం స్పందించగలదు. చెమట, దుమ్ముతో చర్మంపై పేరుకుపోయే బాక్టీరియా, వైరస్‌లతో ఈ ఔషధాలు పోరాడి, వాటిని చంపగలవు."

--డా. నితిన్ మార్వా, పండిత్ ఖుషీలాల్ శర్మ ఆయుర్వేద కళాశాల విభాగాధిపతి

మృగనయని ఎంపోరియం ద్వారా..

ఈ ప్రత్యేక ఔషధ గుణాలున్న ఆయుర్వస్త్ర చీరలు.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రూపుదిద్దుకుంటున్నాయి. భోపాల్-ఇండోర్‌లో ముందుగా విక్రయించిన తర్వాత.. దేశవ్యాప్తంగా ఉన్న 36 మృగనయని ఎంపోరియం కేంద్రాల్లో అమ్మకానికి పెడతారు. మధ్యప్రదేశ్‌లో ఈ కేంద్రాలు 14 ఉండగా... గోవా, ముంబయి, నోయిడా, దిల్లీ, అహ్మదాబాద్, గుజరాత్‌లోని కేవడియా, జైపూర్, కాలిఘట్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, రాయ్‌పూర్‌లలోనూ మృగనయని కేంద్రాలున్నాయి.

"మధ్యప్రదేశ్‌లోని మృగనయని ఎంపోరియం ఆయుర్వేద వస్త్రను ప్రారంభించింది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచే చీరలు. మనదేశంలోని వివిధ నగరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నాం. ముందుగా భోపాల్‌లో ప్రారంభించాం. ఇండోర్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, రాయ్‌పూర్‌కు సరఫరా చేస్తున్నాం."

--రాజీవ్ శర్మ, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్ అభివృద్ధి విభాగం కమిషనర్

పురాతన విధానమే..

మధ్యప్రదేశ్‌ హ్యాండ్‌లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ ఎన్నో దశలు దాటి, మరెన్నో ప్రత్యేక పద్ధతులు అనుసరించి ఈ వినూత్న చీరలు అందుబాటులోకి తెచ్చింది.

"వినియోగదారులకు ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త కాన్సెప్ట్ కావచ్చు.. కానీ ఆయుర్వేదంలో ఇదో పురాతన విధానం. వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది."

--రాజీవ్ శర్మ, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్ అభివృద్ధి విభాగం కమిషనర్

ఈ చీరలు ధరించిన వారి చర్మ రోగ నిరోధక శక్తి పెంచాలన్న ఉద్దేశంతో వీటిని తయారుచేశారు.

"ఈ ఔషధ దుస్తులు ధరిస్తే, శరీరంలో రోగాలను ఎదుర్కొనే నిరోధక శక్తి పెరుగుతుంది."

--వినోద్ మలేవర్, టెక్స్‌టైల్ రంగ నిపుణుడు

ఈ చీరలు తయారుచేయడం వెనక ఉన్న అసలైన ఉద్దేశం సత్ఫలితాలనిస్తే.. కరోనా లాంటి విపత్తుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఔషధ చీరలు ఉపయోగకరంగా ఉంటాయి.

ఇదీ చూడండి:మయూరాల ప్రియనేస్తం ఈ జూనియర్​ పీకాక్​ మ్యాన్​

ABOUT THE AUTHOR

...view details