పెళ్లి ఘనంగా చేసుకున్నారు. బరాత్ ముగిసింది. ఇక వధువును తీసుకుని ఇంటికి వచ్చేద్దాం అనుకున్న పెళ్లి కుమారుడి కుటుంబానికి లాక్‌డౌన్‌తో చిక్కులొచ్చాయి. వరుడు సహా 11 మంది బంధువులు.. వధువు ఇంట్లోనే మకాం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా 60 రోజులు గడిచాక కొత్త దంపతులు స్వస్థలానికి చేరుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్ చౌబేపుర్లోని హకీమ్నగర్ గ్రామానికి చెందిన ఇంతియాజ్, బిహార్ బెగుసరాయ్‌కు చెందిన ఖుష్భూకు మార్చి 21న వివాహం అయింది. పెళ్లికూతురు స్వస్థలంలో పెళ్లి తంతు ముగిసింది. ఇక వచ్చేద్దాం అనుకునేలోపే మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. రవాణా సదుపాయాలు లేక పెళ్లికొడుకుతో పాటు బంధువులు అందరూ ఏకంగా రెండు నెలలు పెళ్లికూతురు ఇంటిలోనే ఉండిపోయారు. తాజాగా నాలుగోదశ లాక్డౌన్ మినహాయింపుల వల్ల వాళ్లకి ఊరట లభించింది. దాదాపు 60 రోజులు తర్వాత కాన్పుర్‌లోని స్వస్థలం చేరారు నూతన వధూవరులు.