ఉత్తర్‌ప్రదేశ్ వారణాసికి చెందిన శ్యామ్ చౌరాశియా మహిళలకు రక్షణ కల్పించే ప్రత్యేక చెవిరింగులను తయారు చేశాడు. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో శిక్షకుడిగా పనిచేసే ఆయన విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేలా అధునాతన పరికరాలతో వాటిని రూపొందించారు. బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కు అనుసంధానమై.. ఆపద సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసుకునేలా చెవిరింగులను తీర్చిదిద్దాడాయన. మరింత ఆపత్కర పరిస్థితుల్లో రక్షణ పొందేందుకు అందులోనే తూటానూ అమర్చడం గమనార్హం.
అందంతో పాటు రక్షణ...
శ్యామ్ తయారుచేసిన చెవిరింగులు మహిళలకు అందాన్ని చేకూర్చడమే కాకుండా... వేధింపుల సమయంలో ఆత్మరక్షణ సాధనంగా పనిచేస్తాయి. మహిళలు ఆపదలో ఉన్న సమయంలో.. బటన్ నొక్కితే బ్లూటూత్ ద్వారా మొబైల్‌కు అనుసంధానం అవుతుంది. అప్పుడు చరవాణిలో కనిపించే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్‌కు కాల్ చేయొచ్చు. దీంతో పోలీసులు ఆ లొకేషన్‌ను గుర్తించి అక్కడికి చేరుకోవడానికి వీలుంటుంది.
రింగులో అమర్చిన బ్యాటరీ పరికరం ద్వారా అందులో ఉన్న తూటానూ పేల్చవచ్చు. ఖాళీ ప్రదేశాల వైపు మాత్రమే పేలే ఈ బుల్లెట్ శబ్ధం సుమారుగా కిలోమీటరు మేర వినిపిస్తుంది. తద్వారా బాధితులను రక్షించేందుకు సమీపంలోని వారు కూడా స్పందించడానికి అవకాశముంటుంది.
మహిళల రక్షణ కోసం ఎప్పుడూ తపించే శ్యామ్... ఇదివరకే లిప్‌స్టిక్, హ్యాండ్‌బ్యాగ్‌లలో కూడా ఇలాంటి భద్రతా పరికరాలను తయారుచేశాడు.