ఓటరు అవగాహన కోసం బ్యాండ్ బాజా 'బరాత్'! ప్రస్తుతం ఎక్కడచూసినా లోక్సభ ఎన్నికల మీదే అందరి దృష్టి. ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలేంటీ? ఎవరెంత ఖర్చు చేయగలరు? ఎక్కడ చూసినా ఇదే చర్చ. కానీ ఓటింగ్ శాతం చూస్తే అరవై నుంచి డెబ్భై శాతమే ఉంటూ వస్తోంది. 90 శాతం సాధిస్తే ఘనతగా భావిస్తాం.
ఓటరు అవగాహన కార్యక్రమాలకు ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు విశేష ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. ప్రతీ ఊర్లోనూ ఓటరు చైతన్యం కోసం ఒకరిద్దరు కృషి చేస్తుంటారు. ఓటు విశిష్టత గురించి చెప్తుంటారు. డబ్బుకు అమ్ముడు పోకూడదంటారు. కానీ వారు చెప్పేదానికి పెద్దగా స్పందన ఉండదు. ప్రభుత్వాల ప్రచారానికీ స్పందన అంతంత మాత్రమే.
ఎలాగైనా ఓటరును చైతన్యం చేయాలని సంకల్పించిన ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం ఓటు విశిష్టతపై అవగాహన కల్పించే ఓ ప్రత్యేక బరాత్ బృందం ఏర్పాటుచేసింది. వినూత్న కార్యక్రమానికి తెరతీసింది. 'ప్రజాస్వామ్య ఊరేగింపు' పేరుతో ఓటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో నృత్యాలు ఏర్పాటు చేస్తోంది. వారు చేసే నృత్యాలకు ఆకర్షితులైన ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పిస్తోంది. కానిస్టేబుళ్లతో పాటు సామాజిక ఉద్యమకారులు సంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు.
" ప్రజాస్వామ్య ఊరేగింపు అనే ఓటు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రజాస్వామ్యం సరిగా అమలు జరగట్లేదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఊరేగింపు ద్వారా ప్రజల్ని ఆకర్షించేందుకు నిర్ణయించాం." - రావత్, ముఖ్య అభివృద్ధి అధికారి, రుద్రప్రయాగ