జమ్ముకశ్మీర్లో 370 అధికరణం రద్దు తర్వాత నిర్వహించిన తొలి జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ) ఎన్నికల్లో ఏడు స్థానిక పార్టీల కూటమి 'పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ)' సత్తా చాటింది.
నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) లాంటి ప్రధాన పార్టీలతో పాటు మరికొన్ని చిన్నపార్టీలతో ఏర్పడిన ఈ కూటమి 280 స్థానాలకు గానూ 100 చోట్ల విజయబావుటా ఎగరేసింది. మరో 12 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకెళ్తోంది.
- భాజపా 73 స్థానాల్లో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. మరో 18 చోట్ల విజయానికి చేరువలో ఉంది. ముఖ్యంగా కశ్మీర్ లోయలో పీఏజీడీ తిరుగులేని హవా కొనసాగించగా, జమ్మూలో భాజపా పట్టు నిలుపుకొంది.
- కాంగ్రెస్ 22 స్థానాలను కైవసం చేసుకొని మరో 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. 47 మంది స్వతంత్ర అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. మరో ఆరు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- జమ్ము అండ్ కశ్మీర్ అప్నీ పార్టీ 11 చోట్ల మాత్రమే విజయాన్ని అందుకుంది. మరొక చోట గెలిచే అవకాశముంది.
- బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని హాజిన్-ఎ, ద్రుగ్ముల్లా నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు షాజియా అస్లాం, సోమియా సదాఫ్ల జాతీయతపై వివాదం తలెత్తగా ఓట్ల లెక్కింపును నిలిపివేశారు.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో స్థానిక సమరం- ఎందుకింత ప్రాధాన్యం?
కశ్మీర్ లోయలో భాజపాకు తొలి విజయం..
కశ్మీర్లో కాషాయ పార్టీ తొలిసారిగా గెలుపు రుచిచూసింది. ఇక్కడి ఖొన్మొహ్-2, తులాలి, కక్పొరా స్థానాల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. కశ్మీర్ చరిత్రలోనే భాజపా ఎన్నికల్లో గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తొలిసారి కశ్మీర్ వ్యాలీలో భాజపా ఖాతా తెరవడంపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ప్రధాన మంత్రినరేంద్ర మోదీని కశ్మీర్ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు