తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసలే బాధలో ఉన్నాం.. మీరూ బాధపెట్టకండి'

'ఫొని' ప్రచండ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశా ప్రజలు నిరసన బాటపట్టారు. ప్రభుత్వ పరిహారంతో పాటు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి యుద్ధ ప్రాతిపదికన కనీస అవసరాలను అందించాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల రాస్తారోకోలు చేశారు.

ఒడిశాలో ప్రజల నిరసనలు

By

Published : May 12, 2019, 4:17 PM IST

ఒడిశాలో ప్రజల నిరసనలు

ప్రచండ గాలులు, భారీ వర్షాలతో ఒడిశాను ముంచెత్తింది 'ఫొని' తుపాను. గంటకు దాదాపు 240 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులు, కుండపోత వానలకు వేల ఎకరాల్లోని పంటపొలాలు దెబ్బతిన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ తుపాను ప్రభావంతో ఒడిశా తీరప్రాంత జిల్లాల్లోని ప్రజలు దాదాపు ఎనిమిది రోజులుగా కనీస అవసరాలకు దూరమై అష్టకష్టాలు పడుతున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే, ఇప్పటికీ అర్హులైన బాధితులకు పరిహారం అందించడంలో అధికారులు తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారు. తుపాను ధాటికి ఇంకా కోలుకోలేదని... ప్రభుత్వమూ తమను బాధపెట్టడం తగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా వీలైనంత తొందరగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జార్జ్​పుర్​ జిల్లాలోని బింజార్​పుర్​లో ఆగ్రహంతో రెవెన్యూ అధికారిపై దాడి చేశారు ప్రజలు.

పారాదీప్​-కటక్​ మధ్య రోడ్డు మార్గాలను పూర్తిగా బంద్​ చేశారు. పూరీ-భువనేశ్వర్​ మధ్య జాతీయ రహదారినీ దిగ్బంధించారు. ఫలితంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ప్రభుత్వం ఏమంటోంది..?

తాగునీటి ఎద్దడి సమస్య పరిష్కారంతో పాటు విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రపారా, జగత్సింగ్​పుర్​, కటక్​ జిల్లాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించే దిశగా 50 వేర్వేరు బృందాలను రంగంలోకి దించింది ఎన్​డీఆర్​ఎఫ్​(జాతీయ విపత్తు నివారణ సంస్థ).

43కు పెరిగిన మృతులు

ఫొని తపానుతో కారణంగా తాజాగా కటక్​, ఖుర్దా జిల్లాల్లో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఫలితంగా మృతుల సంఖ్య 43కు చేరింది.

ఇదీ చూడండి : 'నేను మళ్లీ గెలిచానో... చైనా పని అంతే!'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details