పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన పౌర చట్టం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, జేఎన్యూ ఘటనలపై దిల్లీలో భేటీ అయ్యారు నేతలు. ఈ సందర్భంగా భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేయని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ. విభజన, వివక్షపూరిత అజెండాలను అమలు చేసేందుకు మెజార్టీని భాజపా వినియోగించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసించే హక్కు ఉంటుందన్నారు. యువత గళాన్ని అణచివేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఆనంద్ శర్మ.
'విభజనే సీఏఏ లక్ష్యం'
ప్రజలను మత పరంగా విభజించడమే సీఏఏ లక్ష్యమని తీవ్ర ఆరోపణలు చేశారు సోనియా గాంధీ. సీఏఏ వల్ల దేశానికి హాని జరుగుతుందని యువత గ్రహించాలని సూచించారు. చలిని, పోలీసుల అరాచకాలను తట్టుకుంటూ రోడ్లపైకి వచ్చి విద్యార్థులు నిరసన చేస్తున్నారని కొనియాడారు.
సీఏఏ సంబంధిత ఘటనలపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు సోనియా. ప్రధాని, హోంమంత్రి రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా రోజు గడవడం లేదని దుయ్యబట్టారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) జాతీయ పౌర జాబితాకు(ఎన్ఆర్సీ)కు మారు వేషమన్నారు.
సోనియా అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఇదీ చూడండి: మోదీతో దీదీ భేటీ.. పౌర చట్టం ఉపసంహరణకు విజ్ఞప్తి