కొద్ది సంవత్సరాలుగా అల్లర్లు, హింసాత్మక నేరాల గురించి మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే జాతీయ నేర పరిశోధన సంస్థ(ఎన్సీఆర్బీ)నివేదికల్లో వీటికి సంబంధించిన నేరాలు కనిపించట్లేదు. ఇలాంటి నివేదికలు అధికార పార్టీ ప్రయోజనాలు, భావజాలాన్ని అనుసరించి.. అందులో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనేది నిర్ణయిస్తాయని ప్రతీతి.
2018లో నమోదైన వివరాల ప్రకారం తాజాగా 'భారత్లో నేరాలు-2019' పేరిట నివేదిక విడుదల చేసింది ఎన్సీఆర్బీ. ఇందులో మైనారిటీలపై మూకదాడులు, గో సంరక్షణ పేరిట దాడులు వంటి విద్వేషపూరిత నేరాల వివరాలు ప్రధానంగా ఉండాల్సింది. విద్వేషాన్ని సంక్షిప్త సమాచారం ద్వారా వ్యాప్తి చేసే వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలు ఈ తరహా దాడులకు కారణమయ్యాయి.
ఆ విభాగం మాయం!
2016 వరకు ఎన్సీఆర్బీ నివేదికలో 'వ్యవసాయ అల్లర్లు' అనే ప్రత్యేక విభాగం ఉండేది. 2014లో 628గా ఉన్న ఈ ఘర్షణలు.. ఆ తర్వాత ఊహించని స్థాయిలో పెరిగాయి. 2015లో 327 శాతం పెరుగుదల నమోదు చేస్తూ 2683కు చేరాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వైఫల్యానికి, వ్యవసాయ సంక్షోభానికి ఈ సంఖ్య అద్దం పడుతుందని కొందరి విశ్లేషణ. అంతటి కీలకమైన విభాగం తర్వాత నివేదికల్లో మాయమైంది. పెద్దగా పట్టించుకోని స్థాయిలో ఆ నేరాల సంఖ్య లేనందునే ఆ విభాగాన్ని తీసివేశామన్నది సాధారణంగా అధికారులు చెప్పే మాట.
రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు..
వ్యవసాయ రంగం చాలా సంక్లిష్టమైంది. రైతుల ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకోవటానికి ప్రభుత్వాలు చాలా పాట్లు పడ్డాయి. 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణల్లో వాణిజ్య సాగును ప్రోత్సహించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రాబడులను ఊహించి ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకున్నారు. వర్షాల లేమి, ప్రకృతి వైపరీత్యాలు, కృత్రిమ మందుల ప్రభావంతో పంట దెబ్బతినడం.. అప్పులు పెరిగి రైతుల ఆత్మహత్యలు చేసుకునేందుకు కారణమైంది.
2018 గణాంకాలు పరిశీలిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అయితే నిరుద్యోగ యువత బలవన్మమరణాలు భారీగా పెరిగాయి. ఇది ఏ ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదు. తాజా నివేదికల ప్రకారం 42 ఏళ్ల కనిష్ఠానికి నిరుద్యోగ స్థాయి పడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్సీఆర్బీ ఎలా ఉంటుందోనని ఊహించుకుంటే వణుకుపుడుతోంది.
మహిళలపై నేరాలు..
ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చెందే మరో అంశం మహిళలపై నేరాలు. భారత్లో 2018లో ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మొత్తం నమోదైన కేసులు 33,356. వీటిల్లో 94 శాతం బాధితులకు నిందితులు తెలిసిన వారే కావటం గమనార్హం. బయటపడని కేసులతో పోలిస్తే ఇవి చాలా తక్కువేనని విశ్లేషకుల అభిప్రాయం. బాధితులను సమాజం చూసే కోణాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. అత్యాచారాలు ఎందుకు జరుగుతాయనే భిన్న దృక్పథంలో పోలీసులు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువ. ఇవన్నీ నివేదికల్లో ఉండాల్సిన అవసరం లేదా అన్నది పలువురి ప్రశ్న.