దేశంలో కరోనా వైరస్(కొవిడ్-19) బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళలో ఓ మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది. అదే సమయంలో జమ్ముకశ్మీర్‌లో ఓ 63 ఏళ్ల వృద్ధురాలికి, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తికి ఈ ప్రాణాంతక వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 43కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
కేరళ చిన్నారి..
ఇటీవల కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటలీలో పర్యటించింది. అనంతరం మార్చి 7న వారు భారత్‌కు తిరిగిరాగా.. కోచి విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించారు అధికారులు. కరోనా అనుమానంతో చిన్నారి, ఆమె తల్లిదండ్రులను వేరుగా ఉంచారు. వారి రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పరీక్షా ఫలితాల మేరకు చిన్నారికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. సోమవారం.. ఎర్నాకుళం మెడికల్ కాలేజీలోని ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. చిన్నారి తల్లిదండ్రుల మెడికల్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.