ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న రాకాసి కరోనా వైరస్‌ను ఎదుర్కొనే చర్యల్ని మరింత ముమ్మరం చేసింది భారత్. చైనీయులు, గత రెండు వారాల్లో చైనాలో పర్యటించిన విదేశీయులకు భారత్ వచ్చేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందే జారీచేసిన వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే చైనా వాసులు, చైనాలో పర్యటించిన విదేశీయులకు ఈ-వీసాల జారీ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపేసింది భారత్.
జనవరి 15 అనంతరం చైనాలో పర్యటించి భారత్‌లో ఉన్నవారు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖను సంప్రదించాలని సూచించింది ప్రభుత్వం. ఇందుకోసం హాట్‌లైన్ నెంబర్ 91-11-23978046, ఈ-మెయిల్ ncov2019@gmail.comను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
"భారత రాయబార కార్యాలయం సహా కాన్సులేట్లకు చైనా పౌరులు, ఆ దేశంలో పర్యటించిన విదేశీయుల నుంచి వీసా అంశమై పలు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతమున్న వీసాలు కొనసాగబోవని ప్రకటిస్తున్నాం. భారత్‌లో పర్యటించాలనుకునే వారు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం సహా షాంఘై, గువాంగ్జూలోని కాన్సులేట్లను సంప్రదించవచ్చు."
-చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన
హాంకాంగ్‌కు నిలిచిపోనున్న విమానాలు
హాంకాంగ్‌కు విమాన సర్వీసులను ఫిబ్రవరి 8 నుంచి నిలిపేయనున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా. కరోనా కారణంగా హాంకాంగ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.