మధ్యప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఓ వివాహం, అక్కడి వైద్య శాఖ అధికారులను పరుగులు పెట్టించింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా...? ఆ వివాహంలో పెళ్లి కూతురు ఝిహావో వాంగ్, ఆమె బంధువులు చైనా వారు మరి!
ప్రేమతో మొదలై...
వాంగ్.. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సర్‌కు చెందిన సత్యార్థ్ మిశ్రాను ఐదు సంవత్సరాల క్రితం కెనడాలో చదువుకుంటున్నప్పుడు కలిశారు. కొద్ది సంవత్సరాల ప్రేమ అనంతరం వారు తమ వివాహానికి పెద్దల అనుమతిని పొందారు. తమ వివాహానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. వివాహానికి కొద్ది రోజుల ముందే వాంగ్ తల్లితండ్రులు, మరో ఇద్దరు బంధువులు భారత్‌కు చేరుకున్నారు. దేశంలోని కొన్ని దర్శనీయ స్థలాలను చూసిన అనంతరం జనవరి 29న మంద్‌సర్ చేరుకున్నారు.
అసలే కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో వీరి రాకతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక పారామెడికల్ బృందాన్ని ఝియాహో కుటుంబానికి వైద్య పరీక్షలు జరపటానికి నియమించారు.
"వధువు బంధువులకు కరోనా వైరస్ లక్షణాలు ఏవీ లేనప్పటికీ, మేము ముందు జాగ్రత్తగా ఈ చర్యలను తీసుకుంటున్నాము. ఏమైనా అనుమానాస్పద లక్షణాలు బయటపడితే వారిని ఆస్పత్రిలో చేరుస్తాం."’
--- డాక్టర్ ఏ.కె. మిశ్రా, జిల్లా అస్పత్రి సివిల్ సర్జన్.
ప్రోటోకాల్ ప్రకారం తాము ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వాంగ్ కుటుంబసభ్యులు నలుగురూ తమకు చాలా సహకరిస్తున్నారని కూడా ఆయన తెలిపారు.