తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​ అధ్యక్షుడిగా మీరే కొనసాగాలి' - థరూర్

కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిని వీడొద్దని రాహుల్​ గాంధీని పలువురు నేతలు అభ్యర్థించారు. కాంగ్రెస్​ను నడిపించేందుకు రాహుల్​ సరైన వ్యక్తి అంటూ డీఎంకే, ఆర్జేడీ స్పష్టం చేశాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా!

By

Published : May 29, 2019, 5:56 AM IST

Updated : May 29, 2019, 7:27 AM IST

కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ రాజీనామా నిర్ణయంపై మిత్రపక్ష నేతలు స్పందించారు. కాంగ్రెస్​ను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయాలంటే రాహుల్​ గాంధీయే సరైనవారని అభిప్రాయపడ్డారు. డీఎంకే అధినేత స్టాలిన్​, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్​ యాదవ్, తమిళ నటుడు సూపర్​స్టార్​ రజినీకాంత్​ తదితరులు రాహుల్​కు మద్దతు తెలిపారు.

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయొద్దని రాహుల్​ను స్టాలిన్​ ఫోన్​ ద్వారా కోరినట్టు డీఎంకే ఓ ప్రకటనలో తెలిపింది.

"మీరు పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి దిగిపోవద్దు. ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రజల హృదయాలను గెలిచారు. మీ ఆలోచనను విరమించుకోండి."

- ఎంకే స్టాలిన్​, డీఎంకే అధ్యక్షుడు

కాంగ్రెస్​ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగాలని ప్రముఖ నటుడు రజనీకాంత్​ ఆకాంక్షించారు. యువకుడు కావటం వల్ల సీనియర్​ నేతల నుంచి మద్దతు లభించలేదని తెలిపారు రజనీ. రాహుల్ రాజీనామా చేస్తే భాజపా వ్యూహానికి బలైనట్టేనని లాలూ వ్యాఖ్యానించారు.

"రాహుల్​ రాజీనామా ఆత్మహత్యతో సమానం. భాజపా ఓటమే విపక్షాల ప్రధాన అజెండాగా మారింది. అయితే ప్రజల మద్దతు కూడగట్టలేకపోయాం. ఒక ఎన్నికల్లో ఓటమితో ప్రజల నమ్మకాన్ని కోల్పోయినట్టు కాదు."

-లాలూ ప్రసాద్ యాదవ్​, ఆర్జేడీ అధ్యక్షుడు

ఎన్నికల్లో భారీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని రాహుల్ ప్రకటించారు. అయితే పార్టీలోని సీనియర్​ నేతలు అందుకు అంగీకరించలేదు.

"ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రాహుల్ ప్రకటించారు. జరిగిన తప్పునకు మేమంతా బాధ్యులమే. పార్టీ పునర్వైభవానికి మేమంతా కృషి చేయాల్సి ఉంది. గత ఎన్నికల్లో 44 స్థానాల్లోనే గెలిచాం. ఈ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో గట్టిగా పోరాడాం. అందుకే 52 స్థానాలు సాధించాం. పార్టీని ముందుకు నడిపించే శక్తి రాహుల్​కే ఉంది. ఆయనతో మేమంతా ముందుకు నడుస్తాం. "

-శశిథరూర్​, కాంగ్రెస్ సీనియర్ నేత

రాజీనామాకు బదులుగా పార్టీ ప్రక్షాళనకు రాహుల్ నడుం బిగించాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ అభిప్రాయపడ్డారు. మరో నేత వీరప్ప మెయిలీ కూడా ఇదే తీరులో స్పందించారు.

" కాంగ్రెస్​తో పాటు దేశానికి రాహుల్ కావాలి. కాంగ్రెస్ 135 ఏళ్లనాటి పార్టీ. చాలా సార్లు ఓడిపోయాం. 1977లో ఇందిరా గాంధీ నాయకత్వంలోనే ఓటమి పాలయ్యాం. కానీ 1980లో తిరిగి భారీ విజయం సాధించాం. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడాం. దేశ అవసరాల కోసం కృషి చేశాం. అందుకే పార్టీ బాధ్యతలు రాహుల్ కొనసాగించి అలాంటి పాలన అందించాలని మేం కోరుతున్నాం."

-వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ సీనియర్ నేత

ఇదీ చూడండి:మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతా : దీదీ

Last Updated : May 29, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details