దేశ ఆర్థిక రంగానికి చేయూత అందించే దిశగా నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ)లను పెంచే దిశగా అడుగులు వేసింది. కేబినెట్ నిర్ణయాలను సీనియర్ మంత్రులు ప్రకాశ్ జావడేకర్, పీయూష్ గోయల్ ప్రకటించారు.
"ఆర్థిక ప్రగతి కోసం ఇంతకుముందు విదేశీ రుణాలను ఎక్కువగా తీసుకునేవారు. కానీ మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లలో విదేశీ నిధులను ఎఫ్డీఐల రూపంలో ఎక్కువగా తీసుకొచ్చింది. మా ప్రభుత్వంలో 286 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు ఎఫ్డీఐల రూపంలో భారత్కు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత్కు మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఎఫ్డీఐ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. వాటిని సరళీకరించి పెట్టుబడులను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. దీనితో పాటు సులభతరంగా వ్యాపారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి."