వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లడానికి జారీచేసిన మార్గదర్శకాల వల్ల మహా నగరాలన్నీ ఖాళీ అయి కార్మికులు దొరకని పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం అందులో సవరణలు చేసింది. లాక్‌డౌన్‌కు ముందు అనుకోకుండా సొంతూళ్లు/ పనిచేస్తున్న ప్రాంతాల నుంచి బయటికొచ్చి ఇరుక్కుపోయిన వారికే ఆ వెసులుబాటు వర్తిస్తుందని పేర్కొంది. ఎప్పటినుంచో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి మాత్రం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
ఈ లేఖ అయోమయానికి తెరలేపింది. ప్రస్తుతం స్వస్థలాలకు తరలివెళ్లడానికి బయలుదేరిన వలస కార్మికుల్లో చాలామంది పనుల కోసం వేర్వేరు నగరాలకు వచ్చి అక్కడ తాత్కాలికంగానో, శాశ్వతంగానో నివాసం ఏర్పరుచుకున్నవారే. వీరిలో లాక్‌డౌన్ సమయంలో వచ్చి ఇరుక్కుపోయినవారు చాలా కొద్దిమందే. ఈ కోవలోకి ఎక్కువగా తీర్థ యాత్రికులు, పర్యాటకులు వస్తారు. వేర్వేరు రాష్ట్రాల్లో వలస కూలీలు రైళ్ల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. వీరంతా ఊళ్లకు వెళ్లిపోతే సోమవారం నుంచి ప్రారంభమయ్యే కార్యకలాపాలకు కూలీలు, కార్మికులు దొరకడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో కేంద్ర హోం శాఖ తన పాత ఉత్తర్వులపై స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడం అయోమయాన్ని సృష్టించింది.