తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వితంతువులు, ఒంటరి మహిళలకూ ఇక సంతాన భాగ్యం!

సంతానంలేని దంపతులకు ఊరటనిచ్చే సరోగసీ చట్టాన్ని మరింత సరళీకరించనుంది కేంద్రం. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ సరోగసీ క్రమబద్ధీకరణ బిల్లు- 2020కి ఆమోద ముద్ర వేసింది. జమ్ముకశ్మీర్​లో ఉమ్మడి జాబితా అమలు, చాబ్​హర్ ఓడరేవుకు ఉన్న అడ్డంకుల తొలగింపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

cab
వితంతువులు, ఒంటరి మహిళలకూ ఇక సంతాన భాగ్యం!

By

Published : Feb 26, 2020, 7:56 PM IST

Updated : Mar 2, 2020, 4:15 PM IST

సంతానంలేని దంపతులకు ఊరటనిచ్చే సరోగసీ క్రమబద్ధీకరణ బిల్లు-2020కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ సిఫారసులతో 'సరోగేట్' అనే పదాన్ని పునఃనిర్వచించడం సహా వంధ్యత్వం అనే పదాన్ని తొలగించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. దగ్గరి బంధువులు మాత్రమే కాక ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చే మహిళలను కూడా సరోగేట్‌గా పనిచేయడానికి అనుమతించాలన్న సెలక్ట్‌ కమిటీ సిఫారసుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. నూతన బిల్లు చట్టరూపం దాలిస్తే వితంతువులు, విడాకులు పొందిన మహిళలకు లాభం చేకూరనుంది.

గతేడాది ప్రవేశపెట్టిన బిల్లును పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన రాజ్యసభ సెలెక్ట్ కమిటీ బిల్లులో పలు మార్పులను ప్రతిపాదించింది. ఈ మేరకు సెలెక్ట్ కమిటీ చేసిన అన్ని సిఫారసులను నూతన బిల్లులో పొందుపరచింది ప్రభుత్వం. కమిటీ సూచించిన ప్రకారం వ్యాపారాత్మక ధోరణితో చేసే సరోగసీని నిషేధిస్తున్నట్లు.. నిస్వార్థంగా చేసే సరోగసిని అనుమతిస్తున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్. దంపతులిద్దరు భారతీయ మూలాలున్న వారు అయితేనే దేశంలో సరోగసీకి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్ ఉమ్మడి జాబితా

జమ్ముకశ్మీర్‌ ఉమ్మడి జాబితాలో.. కేంద్ర చట్టాల అమలుకు ఆమోదముద్ర వేసింది కేబినెట్. 37 కేంద్ర చట్టాలను జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోకి తెచ్చేందుకు అంగీకారం తెలిపింది.

చాబహర్​ నిర్మాణం కోసం

భారత్​- ఇరాన్ సంయుక్త ప్రయోజనాల కోసం చేపట్టిన చాబహర్ ఓడరేవు అభివృద్ధి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్​కు ప్రభుత్వ రంగ సంస్థ నిబంధనలు సడలించేందుకు నిర్ణయించింది. చాబహర్ ఓడరేవు ఉపయోగంలోకి వస్తే మధ్య ఆసియాలో భారత్​కు వ్యూహాత్మకంగా లాభిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా చాబహర్ ఓడరేవుకు నిధులు వెచ్చిస్తోంది భారత్.

జాతీయ సాంకేతిక టెక్స్​టైల్ మిషన్..

1480 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ సాంకేతిక టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. తంజావూరులోని నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీకి జాతీయ ప్రాముఖ్యత హోదాను ఇచ్చే బిల్లును ఆమోదించింది. సాంకేతిక టెక్స్​టైల్స్ అభివృద్ధి దిశగా 2020-21 నుంచి 2023-24 వరకు నాలుగేళ్ల పాటు ఈ మిషన్​ను అమలు చేయనుంది.

భారత్-మయన్మార్.. అవగాహన

భారత్‌-మయన్మార్‌ మధ్య 3 అవగాహన ఒప్పందాలకు ఆమోదం తెలిపింది కేబినెట్. పెట్రో ఉత్పత్తులు, కమ్యూనికేషన్‌ రంగంలో సహకారం సహా కలప అక్రమ రవాణాపై పోరాటంలో సహకారానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది.

ఇదీ చూడండి:సరోగసీలో భారీ మార్పులు.. అద్దె గర్భం మరింత సులభం

Last Updated : Mar 2, 2020, 4:15 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details