తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2019, 12:26 PM IST

Updated : Apr 8, 2019, 3:17 PM IST

ETV Bharat / bharat

'రామ మందిర నిర్మాణం- సంక్షేమ భారతం'

నవభారత నిర్మాణ స్వప్నానికి మేనిఫెస్టోతో అక్షర రూపం కల్పించింది భాజపా. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే సరికి పేదరికం లేని, స్వశక్త, సంపన్న దేశంగా భారత్​ను తీర్చిదిద్దే లక్ష్యంతో సంకల్ప పత్రం విడుదల చేసింది. సాధ్యమైనంత త్వరగా రామ మందిర నిర్మాణం, రైతులకు పింఛను, సున్నా శాతం వడ్డీతో లక్ష వరకు రుణం, నల్​ సే జల్​ వంటి హామీలతో ప్రజాకర్షక మంత్రం జపించింది.

భారతీయ జనతా పార్టీ 'విజయ సంకల్పం'

2014లో ప్రారంభించిన ప్రగతి యజ్ఞాన్ని కొనసాగిస్తామన్న భరోసా కల్పిస్తూ ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరించింది భాజపా. 2022 నాటికి నవ భారతం నిర్మించాలన్న కలను సాకారం చేసుకునేందుకు అనుసరించనున్న ప్రణాళికతో 45 పేజీల విజయ సంకల్ప పత్రం విడుదల చేసింది.

నవభారతం, సంక్షేమంతోపాటు రామ మందిర నిర్మాణం అంశానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది భాజపా. త్వరితగతిన మందిర నిర్మాణం చేపట్టేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ పరిశీలిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

దిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ మేనిఫెస్టో విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్​షా, కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

'రామ మందిర నిర్మాణం- సంక్షేమ భారతం'

ప్రజల మేనిఫెస్టో!

దేశంలోని 6 కోట్ల మంది ప్రజల అభిప్రాయాల్ని వేర్వేరు మార్గాల్లో తెలుసుకుని మేనిఫెస్టో రూపొందించినట్లు చెప్పారు కమలనాథులు. సంకల్ప్ పత్రాన్ని 'ప్రజల మనసులో మాట'గా అభివర్ణించారు.

భారత్​@75 కోసం 75 లక్ష్యాలు...

ఐదేళ్ల మోదీ పాలనలో భారత్​ సాధించిన విజయాల్ని మేనిఫెస్టోలో ప్రస్తావించింది భాజపా. అదే జోరును కొనసాగిస్తామని భరోసా ఇస్తూ మరికొన్ని కీలక హామీలు ఇచ్చింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి ప్రతి భారతీయుడి జీవితంలో సకారాత్మక మార్పు తెచ్చే లక్ష్యంతో 75 హామీలు ఇచ్చింది భాజపా.

భాజపా హామీల్లో కీలకమైనవి కొన్ని....

దేశ భద్రత

* ఉగ్రవాదంపై ఉక్కుపాదం, సాయుధ దళాలు, రక్షణ రంగం బలోపేతం

* అసోంలో తీసుకొచ్చిన జాతీయ పౌర రిజిస్టర్-ఎన్​ఆర్​సీ​ క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలు

* జమ్ముకశ్మీర్​లో శాంతి భద్రతల పునరుద్ధరణకు చర్యలు- ఆర్టికల్​ 370 రద్దు

రైతులు...

* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

* ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్​ యోజన లబ్ధి మరింత మంది రైతులకు చేరేలా చర్యలు

* 60ఏళ్ల వయసుపైబడ్డ చిన్న, సన్నకారు రైతులకు పింఛను

* గ్రామీణ-వ్యవసాయ రంగంలో రూ.25లక్షల కోట్ల పెట్టుబడులు

గ్రామ స్వరాజ్యం...

* గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం కృషి

* 2022 నాటికి ప్రతి కుటుంబానికీ సొంతిల్లు, తాగునీరు, డిజిటల్ అనుసంధానత, రహదారి అనుసంధానత.

ఆర్థికం....

* భారత్​ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దడమే లక్ష్యం

* ఆర్థిక వ్యవస్థ విలువను 2025 నాటికి 5 ట్రిలియన్​ డాలర్లు, 2032 నాటికి 10 ట్రిలియన్​ డాలర్లకు పెంచడమే లక్ష్యం

* నిజాయితీగా పన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేలా పన్ను రేట్లు తగ్గింపు.

* జీఎస్టీని మరింత సులభతరం చేసేందుకు చర్యలు

* 2024 నాటికి మౌలిక వసతుల రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు

మౌలిక వసతులు...

* గ్యాస్​ గ్రిడ్​లు, వాటర్​ గ్రిడ్​లు, ఐ-వేస్​, ప్రాంతీయ విమానాశ్రయాలతో తర్వాతి తరం మౌలిక వసతుల అభివృద్ధి

* రానున్న ఐదేళ్లలో కనీసం 50 నగరాల్లో మెట్రో వ్యవస్థ ఉండేలా చర్యలు

* 2024 నాటికి ప్రతి ఇంటికీ పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరా... ఇందుకోసం 'నల్​ సే జల్​' పథకం అమలు

* రానున్న ఐదేళ్లలో 60వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం

* మారుమూలు ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేసేందుకు భారత్​మాల 2.0

అందరికీ ఆరోగ్యం...

* ఆయుష్మాన్​ భారత్​ పథకం విస్తరణ

* లక్షా 50 వేల ఆరోగ్య కేంద్రాల్లో 2022 నాటికి టెలీమెడిసిన్​, వైద్య పరీక్షల సేవలు

సుపరిపాలన...

* జమిలి ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీల ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి

యువ భారత్​...

* ఆర్థిక వ్యవస్థలో కీలకమైన 22 రంగాల్లో ఉపాధి సృష్టి

* పారిశ్రామికవేత్తలకు రూ. 50లక్షల వరకు పూచీకత్తు అవసరం లేని రుణం.

అందరికీ విద్య...

* విద్య నాణ్యత పెంపునకు కృషి

* ఉపాధ్యాయుల శిక్షణ కోసం జాతీయ సంస్థ ఏర్పాటు... నాణ్యమైన విద్య అందించేలా ఉపాధ్యాయులకు నాలుగేళ్ల శిక్షణ కోర్సు

* 2024 నాటికి మరో 200 కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాలు ప్రారంభం

* కేంద్రం పరిధిలోని లా, ఇంజినీరింగ్​, సైన్స్, మేనేజ్​మెంట్​ విద్యాసంస్థల్లో రానున్న ఐదేళ్లలో సీట్ల సంఖ్య 50శాతం పెంపు

మహిళా సాధికారత....

* ముమ్మారు తలాఖ్​ నిషేధానికి చట్టం

* రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్​

సాంస్కృతికం...

* రాజ్యాంగానికి లోబడి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అవసరమైన చర్యలు

* భక్తుల మనోభావాలు కాపాడేలా శబరిమల వ్యవహారంలో సుప్రీంకోర్టులో సమర్థ వాదనలు

* ఉమ్మడి పౌర స్మృతి

Last Updated : Apr 8, 2019, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details