భాజపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పౌరచట్టం, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్ఆర్సీలపై ప్రజల్లో చెలరేగుతున్న నిరసనలను నియంతృత్వ విధానంతో అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. భద్రతాదళాలతో ప్రజాగళాన్ని నొక్కివేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని అభిప్రాయపడ్డారు.
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా విద్యార్థులు, మేధావులు, జర్నలిస్ట్లు, సామాజిక కార్యకర్తలు చేస్తున్న నిరసనలపై భాజపా సర్కారు వ్యవహరిస్తున్న విధానం సరికాదన్నారు. ఆందోళనలను నిలిపేందుకు హింసాయుత మార్గంపై ప్రభుత్వం ఆధారపడటం ఆమోదయోగ్యం కాదన్నారు ప్రియాంక.
పౌరసత్వ చట్ట సవరణ, దేశవ్యాప్త ఎన్ఆర్సీ భారత రాజ్యాంగానికి విరుద్ధమని ఉద్ఘాటించారు ప్రియాంక. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని ప్రజలు ఎంతమాత్రం అంగీకరించబోరని వ్యాఖ్యానించారు.