తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2019, 6:16 AM IST

ETV Bharat / bharat

పరమత సహనం వెల్లివిరిసే బెళగావి ఆలయం!

భారత్​.. అతిపెద్ద లౌకిక దేశం అయినా మతం పేరుతో అడపాదడపా ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. కర్ణాటక, గోవా సరిహద్దుల్లో ఉండే బెళగావిలోని ఓ ఆలయంలో మాత్రం పరమత సహనం వెల్లివిరుస్తోంది. ఇక్కడ హిందూ దైవమైన శివుడు, క్రైస్తవులు ఆరాధించే యేసుక్రీస్తు విగ్రహాలు ఒకే ఆలయంలో కొలువై ఉంటాయి.

పరమత సహనం వెల్లివిరిసే బెళగావి ఆలయం!

పరమత సహనం వెల్లివిరిసే బెళగావి ఆలయం!
బెళగావి బైల్ హోంగ్లా తాలుకాలోని దేశనూరు గ్రామంలో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడ శివుడు, యేసుక్రీస్తు ఒకే గుడిలో ఆరాధనలు అందుకొంటూ ఉంటారు. దూరం నుంచి చూస్తే చర్చి రూపంలో కనిపించే ఈ ఆలయం, లోపలికి వెళితే హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్మించిన గుడిగా దర్శనమిస్తుంది.

వేరు వేరు కాదు

ఎవరి పూజలు వారు చేసుకుంటూ సామరస్యంగా ఉంటారులే అని తేలిగ్గా మాత్రం తీసుకోవద్దు. క్రైస్తవ ఫాదర్లు సైతం మెడలో రుద్రాక్ష మాల, నుదుటన విభూతిని ధరిస్తారు. ఇదేదో ఈ మధ్యకాలంలో ప్రారంభమైన వ్యవహారం కాదండీ బాబూ... 16 శతాబ్దం నుంచి ఈ ఆలయంలో ఇదే తంతు కొనసాగుతోంది.

అందరూ ఆహ్వానితులే...

అన్ని మతాల వారు ఈ ఆలయంలో పూజలు చేస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ ప్రాథమిక పాఠశాల, అనాథ శరణాలయాన్ని సైతం నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారికి ఆయుర్వేద మందుల్ని సైతం అందిస్తున్నారు.

16వ శతాబ్దంలో నిర్మాణం

సెయింట్ జాన్ పింటో అనే క్రైస్తవ ఫాదర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికొచ్చే క్రైస్తవ ఫాదర్లు హిందూ, క్రిస్టియన్​ సంప్రదాయాల్ని అనుసరిస్తుంటారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోందీ ఆలయం.

ఈ ఆలయం నెలకొని ఉన్న దేశనూరు గ్రామ జనాభా ఎంత అనుకుంటున్నారు. 5 వేలు మాత్రమే. గమనించాల్సిన మరో అంశమేమిటంటే గ్రామంలో క్రైస్తవ మతస్థులు ఒక్కరూ లేకపోవడం. కానీ హిందువులు మాత్రం ఇద్దరు దేవుళ్లకు సమాన పూజలు చేస్తారు. నిత్యం మతాల పేరుతో భారతీయులపై విద్వేషాల్ని రెచ్చగొట్టే వారికి.. మార్పు కోసం ఆదర్శంగా నిలుస్తోంది ఈ విఖ్యాత ఆలయం.

ABOUT THE AUTHOR

...view details