పెళ్లి, ఆ తర్వాత బరాత్ అంగరంగ వైభవంగా జరుగుతాయి. బరాత్‌లో పాల్గొనేందుకు వరుడి బంధువులు వధువు ఇంటికి వస్తారు. బరాత్ పూర్తి చేసుకుని మూడో రోజు సొంత ఊరికి చేరుతారు. అయితే.. ఉత్తర్‌ప్రదేశ్ అలీఘడ్‌లో బరాత్ బృందానికి వింత అనుభవం ఎదురైంది. కరోనాతో లాక్డౌన్లో చిక్కుకుని 22 రోజులుగా వధువు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.
అలీఘడ్‌లోని అత్రౌలికి చెందిన యువతితో ఝార్ఖండ్‌కు చెందిన విజయ్ మహతో అనే యువకుడికి మార్చి 21న వధువు ఇంట్లో వివాహం జరిగింది. కుమారుడి పెళ్లి బరాత్ (పెళ్లి ఊరేగింపు) కోసం 15 మంది బంధువులను తీసుకుని అత్రౌలికి వచ్చాడు వరుడి తండ్రి రామ్నాత్ మహతో. వీరంతా బరాత్ పూర్తి చేసుకుని మార్చి 23న ఝార్ఖండ్‌కు తిరిగి వెళ్లాలి. కానీ.. 22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించటం.. ఆ వెంటనే లాక్డౌన్ ప్రకటించటం వల్ల వధువు ఇంట్లోనే చిక్కుకుపోయారు బరాత్‌కు వచ్చిన వరుడి బంధువులు. గత 22 రోజులుగా అక్కడే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు.
వరుడు, అతని బంధువులకు ఏర్పాట్లు చేయటంలో ఇబ్బందులు పడుతున్నామని వధువు తండ్రి నర్పత్ రాయ్ పేర్కొన్నారు.
" వారు వెళ్లేందుకు జిల్లా అధికారులు అనుమతించటం లేదు. వారికి అధికారులే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం పెడుతున్నా. 15 మందికి రోజుకు రెండుసార్లు ఆహారం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సరకులు తేవడానికి ఇబ్బందులు పడుతున్నాం. చేతిలో డబ్బు కూడా అయిపోయింది."