దేశంలో రోజుకు సగటున 80 హత్యలు, 289 కిడ్నాప్‌లు, 91 అత్యాచారాలు నమోదవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో-ఎన్సీఆర్బీ తెలిపింది. 2018 ఏడాదికి గానూ నేర గణాంకాలను విడుదల చేసింది ఎన్సీఆర్బీ. 2017తో పోలిస్తే 2018లో నేరాల సంఖ్య 1.3 శాతం పెరిగిందని తెలిపింది. అయితే 2017 కన్నా 2018లో నేర సాంద్రత తగ్గిందని వివరించింది.
2018లో మొత్తం... 50,74,634 నేరాలు నమోదయ్యాయని చెప్పింది ఎన్సీఆర్బీ. ఇందులో భారత శిక్షాస్మృతి ప్రకారం 31,32,954 కేసులు, ప్రత్యేక, స్థానిక చట్టాల ప్రకారం 19,41,680 కేసులు ఉన్నాయి.
హత్యలు, కిడ్నాప్‌లు...
2018లో మొత్తం 29,017 హత్య కేసులు నమోదయ్యాయి. హత్య కేసులకు గొడవలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీని తర్వాత వ్యక్తిగత కక్షలు, శతృత్వం వల్ల ఎక్కువగా హత్యలు జరిగాయి. 2017తో పోలిస్తే 2018లో కిడ్నాప్ కేసులు 10.3 శాతం పెరిగాయి. 2018లో మొత్తంగా 1,05,734 అపహరణ కేసులు నమోదయ్యాయి. కిడ్నాపైన వారిలో అత్యధికంగా ఆడవారే ఉన్నారు. మొత్తం 24,665 మంది మగవారు కిడ్నాప్ కాగా... 80,871 మంది ఆడవాళ్లు అపహరణకు గురయ్యారు. ఇందులో 92,137 మంది ఆచూకీ లభించింది. ఆచూకీ లభించిన వారిలో 91,709 మందిని ప్రాణాలతో పట్టుకోగలిగారు. 428 మంది చనిపోయిన తర్వాత ఆచూకీ లభ్యమైంది.