మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ ద్వితీయ వర్ధంతి సందర్భంగా... దిల్లీ ఆజాద్ భవన్లోని భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్)లో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి... వాజ్పేయీ ప్రజాస్వామ్య ఆదర్శ భావాలను స్మరించుకున్నారు. భారత రాజకీయ చరిత్రలో ఎన్నో మహోన్నత ఘట్టాలను లిఖించిన గొప్ప నాయకుడని వాజ్పేయీని కొనియాడారు. గొప్ప ఉదారవాద ఆలోచనలు గల వ్యక్తి అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా వాజ్పేయీ ప్రవర్తించేవారని.. ప్రజాభిప్రాయాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే వారని రాష్ట్రపతి గుర్తుచేశారు.
"దేశం తరఫున నివాళులు అర్పిస్తూ... చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్నాం. గత ఫిబ్రవరిలో పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో అటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం ఓ చారిత్రక అవకాశం. నేడు ఆయన రెండో వర్ధంతి సందర్భంగా మరోసారి ఆ గొప్ప జాతీయవాదిని స్మరించుకుంటున్నాం."