ప్రసార మాధ్యమాలపై 'అధికారిక రహస్యాల చట్టం' ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించడం నిందనీయమని ఎడిటర్స్ గిల్డ్ ఆక్షేపించింది. రఫేల్ కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది.
రఫేల్ వివాదంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున బుధవారం అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. రఫేల్ ఒప్పందంపై మీడియా ప్రచురించిన వార్తలకు ఆధారాలు చూపాలని కోరారు. రక్షణ మంత్రిత్వశాఖ నుంచి రహస్య పత్రాలు చోరీకి గురయ్యాయని, వాటిని దుర్వినియోగం చేసిన వారిపై అధికారిక రహస్యాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని మీడియాను ఉద్దేశించి అన్నారు.