దిల్లీ అల్లర్ల అంశంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఫిబ్రవరి 25 తర్వాత ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు జరగలేదని చెప్పారు. అల్లర్లు చెలరేగిన 36 గంటల్లోనే దిల్లీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారని షా వివరించారు.
దిల్లీ ఘటనల్ని కొందరు రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు అమిత్ షా. ట్రంప్ పర్యటన ముందే నిర్ణయించిన కార్యక్రమమని గుర్తు చేశారు. దిల్లీలో ట్రంప్ పాల్గొనే కార్యక్రమాలకు తాను హాజరుకావాల్సి ఉన్నా... అల్లర్లు ఆపేందుకు పోలీసులతో కలిసి కృషి చేసినట్లు తెలిపారు అమిత్ షా.
విపక్షాల ధ్వజం
అంతకుముందు చర్చ సందర్భంగా అమిత్ షా, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. రోమ్ తగలబడిపోయినప్పడు నీరో రాజు ఫిడేల్ వాయించిన చందంగా మోదీ వ్యవహరించారని కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. అత్యంత శక్తిమంతమైన పోలీస్ వ్యవస్థ కలిగిన దిల్లీలో మూడు రోజుల పాటు అల్లర్లు జరగడమేంటని ప్రశ్నించారు. దిల్లీలో హింస జరుగుతుంటే మోదీ మాత్రం అహ్మదాబాద్‌లో ట్రంప్‌కు ఆతిథ్యం ఇచ్చారని దుయ్యబట్టారు. దిల్లీ అల్లర్లలో మానవత్వం ఓడిపోయిందన్నారు అధిర్.
దిల్లీ అల్లర్లను కట్టడిచేయలేక పోయినందుకు అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి.
దిల్లీ అల్లర్లు కొందరిలోని కరుడుగట్టిన విద్వేషానికి నిదర్శమన్నారు ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసి. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: భాజపాలోకి సింధియా- ఎంపీలో సరికొత్త 'పవర్ ప్లే'