సూక్ష్మపోషక ఆధారిత రాయితీ (ఎన్‌బీఎస్) విధానం అమలులోకి వచ్చి ఎనిమిదేళ్లయినా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఏమాత్రం తగ్గలేదు. యూరియాపై మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉంది.
ఈ విధానం ప్రకారం యూరియా గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)ను మాత్రమే కేంద్రం నిర్ణయించి, మిగతా ఎరువులను కంపెనీలకు వదిలేస్తున్నాయి. దీనివల్ల ఎరువుల విక్రయాల్లో మోసాలు, అక్రమాలు సాధారణమయ్యాయి. దీనికితోడు గత పుష్కరకాలంలో అనేక ప్రయోగాలతో పరీక్షించి అమలులోకి తెచ్చిన సమగ్ర ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్‌ఎమ్‌ఎస్) కూడా ఎరువుల కొరత, అక్రమ అమ్మకాలకు ఊతమిస్తోంది. ఎరువులపై ఇస్తున్న వేల కోట్ల రూపాయల రాయితీ నిధుల్లో కొంతైనా మిగుల్చుకోవాలనే తపనతో కేంద్రం ఎన్‌బీఎస్, ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌లు ప్రవేశపెట్టినా రైతులకు కష్టాలు తప్పడం లేదు. కేంద్రానికి రాయితీ నిధులూ మిగలడం లేదు. అటు ప్రభుత్వ విధానాలు, ఇటు వ్యాపారుల మోసాలు రైతుల జేబుకు చిల్లుపెడుతున్నాయి.
ఇదేం విధానం..?
రైతులు భరించగలిగే స్థాయి ధరలకు ఎరువులు లభించేలా చూడాలన్నది ప్రభుత్వ విధానమని కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో ఏ గ్రామంలోని దుకాణానికి వెళ్లినా బస్తాలపై ముద్రించిన ధరకు ఎక్కువ శాతం అమ్మడం లేదు. గట్టిగా అడిగితే ఎరువుల కొరత అని చెబుతున్నారు. మరోవైపు ఎరువులకు కొరతే లేదని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ పార్లమెంటుకు తెలిపారు. ఎరువులను నల్లబజారుకు తరలించి, ధరలు పెంచి రైతులను వ్యాపారులు దోచుకోవడం దశాబ్దాలుగా సాగుతోంది. దీన్ని అరికట్టి రాయితీ పంపిణీ, అమ్మకాల్లో పారదర్శకత తేవాలని 2007 మే నెలలో ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఎఫ్‌ఎమ్‌ఎస్)ను కేంద్రం ప్రారంభించింది.
కంపెనీలో తయారైనప్పటి నుంచి జిల్లా కేంద్రంలోని గోదాములకు చేరేవరకూ ఎరువు ఎటు నుంచి ఎటువెళ్తుందో పసిగట్టాలనేది ఈ ఏర్పాటు లక్ష్యం. తరవాత ‘మొబైల్ ఎఫ్‌ఎమ్‌ఎస్’ విధానాన్ని 2012లో ప్రవేశపెట్టారు. తయారీనుంచి రైతుకు అమ్మేవరకు ఎరువు ప్రతీ కదలికను ఆన్‌లైన్‌లో వ్యాపారులు, కంపెనీలు నమోదు చేయాలి. దీన్ని మరింత పారదర్శకంగా మార్చి ‘సమగ్ర ఐఎఫ్‌ఎమ్‌ఎస్’ను 2016 సెప్టెంబరు నుంచి అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం గుజరాత్‌లో ఉన్న ఓ కంపెనీలో యూరియా తయారు చేసి తెలంగాణలోని మారుమూల ఆదిలాబాద్‌కు రైలులో పంపితే కంపెనీ ఆన్‌లైన్‌లో ఎంత పంపారనేది నమోదు చేయాలి. రైలు నుంచి దించి టోకు, చిల్లర వ్యాపారులకు ఎరువులు చేరగానే వారూ వివరాలు పొందుపరచాలి. అందుకోసం ప్రతి చిల్లర వ్యాపారికి ‘పాయింట్ ఆఫ్ సేల్’(పాస్) యంత్రం ఇచ్చారు. రైతు వేలిముద్రను, ఆధార్ సంఖ్యను నమోదు చేసిన తరవాతే అమ్మాలి.
ఇవన్నీ పక్కాగా పూర్తయ్యాక విక్రయాలను రాష్ట్ర వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో ధ్రువీకరిస్తే కంపెనీకి రాయితీ సొమ్మును కేంద్ర ఎరువుల శాఖ విడుదల చేస్తోంది. ఈ పద్ధతి వల్ల దేశంలో రైతులు ఎంత ఎరువు కొన్నారన్న వివరాలు ప్రభుత్వాల చేతికందుతాయి. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో రైతు బ్యాంకు ఖాతాకే ఎరువుల రాయితీ బదిలీ(డీబీటీ) విధానం తేవాలనేది కేంద్ర సర్కారు సంకల్పమని 2012లో చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌నే వ్యాపారులు సరిగ్గా అమలు చేయడం లేదు. నల్లబజారులో అధిక ధరలకు అమ్ముకుని మరెవరినో పిలిచి వేలిముద్ర వేయించి, ఆధార్ నమోదు చేసి, వారికే వేల బస్తాలు అమ్మినట్లు రాత్రికి రాత్రే నమోదు చేస్తున్నారు. ఎమ్మార్పీ ధరనే వసూలు చేసినట్లు చూపిస్తున్నారు. ఇలా అక్రమాలు బయటపడకపోవడంతో డీబీటీ విధానం ఎలా తేవాలన్నదానిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో ఏమాత్రం తేడాలొచ్చినా వేలకోట్ల రూపాయలు దుర్వినియోగమవుతాయి.
నిరుడు ఎరువుల రాయితీల కింద కంపెనీలకు రూ.73,435 కోట్లు చెల్లించారు. యూరియాకు ఇచ్చిన రాయితీ సొమ్మే 65.83 శాతం(రూ.48,349 కోట్లు) ఉంది. దేశంలో ఎన్నో రకాల రసాయన ఎరువులను రైతులు వాడుతున్నా వాటన్నింటికీ కలిపి రాయితీ మొత్తంలో మూడోవంతే దక్కుతున్నాయి. మిగతా ఎరువులకు, యూరియా ధరలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. యూరియా ధర చాలా తక్కువగా ఉన్నందువల్ల దీనిపైనే అవినీతి జరిగి ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. 50 కిలోల డీఏపీ (డై అమ్మోనియం ఫాస్ఫేట్) బస్తా ధర రూ.1,250. 45 కిలోల యూరియా ధర రూ.266.50. అధిక ధరలున్న ఇతర ఎరువులు కొనడంకన్నా యూరియానే రెండుసార్లు చల్లితే పైరు పచ్చగా వస్తుందని రైతులు నమ్ముతున్నారు. దాంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. నత్రజని భూమిలో తక్కువగా ఉందని భూసార పరీక్షల్లో తేలితేనే యూరియా వాడాలి. దీన్ని రైతులు పాటించడం లేదు. వ్యవసాయశాఖ భూసార పరీక్షలు సరిగ్గా చేయకపోవడం, చేసినా ఫలితాలను సకాలంలో రైతులకు అందజేయకపోవడం వల్ల ఏ చేనుకు ఎంత ఎరువు వాడాలనే దానిపై అవగాహన ఉండటం లేదు.