దిల్లీలో 'బాబా కా దాబా'ను నడిపే వృద్ధ దంపతులను ఆదుకున్నట్లే ఆగ్రాలో నారాయణ్ సింగ్ అనే వృద్ధుడిని నెటిజన్లు ఆదరిస్తున్నారు. 'కాన్‌జీ బడే' హోటల్‌కు ఇప్పుడు ఎంతోమంది విచ్చేస్తున్నారు. అతడితో ఫోటోలు దిగి మురిసిపోతున్నారు.
అసలెవరీ నారాయణ్ సింగ్..?
ఆగ్రాలో కమాలా నగర్ ప్రాంతంలో 'కాన్‌జీ బడే' పేరుతో ఓ హోటల్‌ను నడపుతున్నారు 90 ఏళ్ల నారాయణ్ సింగ్. 40 ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కరోనాతో విధించిన లాక్డౌన్ అతడి ఉపాధిని దెబ్బతీసింది. అంతో ఇంతో వచ్చే సంపాదన కూడా రాకుండా పోయింది.
" లాక్డౌన్ వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాను. నా బతుకుదెరువును కోల్పోయాను. హోటల్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది."
-- నారాయణ్ సింగ్, కాన్‌జీ బడేహోటల్ యజమాని
ఆ వీడియోతో..
నారాయణ్ సింగ్ దీనస్థితిని తెలుపుతూ ధనిష్ట అనే అమ్మాయి ఓ వీడియోను తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారగా.. ఎంతో మంది అతడి హోటల్‌కు విచ్చేస్తున్నారు. 'కాన్‌జీ బడే'ను సందర్శించిన వారిలో ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ కూడా ఉన్నారు.
"దిల్లీలో 'బాబా కా దాబా' గురించి తెలుసుకుని ఆ ప్రేరణతో నేను ఈ వీడియో తీశాను. అందరికీ చేరేలా ప్రయత్నించాను. ఈ వీడియో వల్ల స్థానికంగా ఆ వృద్ధుడికి సాయం అందుతుందని నేను అనుకున్నాను. ఇలాగే మరింత మందికి నేను సాయపడాలనుకుంటున్నాను. "
-- ధనిష్ట, (కాన్‌జీ బడే వీడియో తీసిన యువతి)
అసిస్టెంట్ కోసం..
దిల్లీ మాలవియా నగర్‌లోని 'బాబా కా దాబా' యజమాని కాంతా ప్రసాద్... ఇప్పుడక్కడ ఓ సెలెబ్రెటీలా మారిపోయాడు. ఎంతో మంది అతనితో ఫోటోలు దిగేందుకు బారులు తీరుతున్నారు. అనేక కంపెనీలు తమ ఉత్పత్తులు ప్రచారం కోసం ఆ హోటల్ దగ్గరకు విచ్చేస్తున్నాయి. ఇప్పుడు తనకు వచ్చిన గిరాకీని సర్దుబాటు చేసుకునేందుకు, తన హోటల్లో పనిచేసేందుకు ఓ సహాయకుడినీ నియమించుకోవాలని చూస్తున్నాడు కాంతా ప్రసాద్.
ఈ రెండు ఉదంతాలు.. సామాజిక మాధ్యమాల ద్వారా అందే సేవను చాటుతున్నాయి.
ఇదీ చూడండి:ఫోన్ కోసం 60 అడుగుల బావిలో నీటిని తోడేశాడు!