పరువు కోసం కొందరు ప్రాణాలను సైతం లెక్క చేయరు. తమ కూతురో, కొడుకో.. ఎవరైనా తల్లిదండ్రులకు నచ్చని విధంగా ప్రేమ వివాహం చేసుకుంటే కోపంతో ఊగిపోతారు. బిడ్డపై ప్రేమ కన్నా పరువే ముఖ్యమనుకుంటారు. ఇంట్లో నుంచి పంపించేస్తారు. కొందరైతే చంపించేస్తారు. ఇక అక్రమ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కారణంగా మనుషుల మధ్య బంధాలు తెగిపోతున్న ఘటనలు ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జంతువులకూ ఆ సమస్య తలెత్తింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ పొమెరేనియన్ జాతికి చెందిన శునకం... పక్కింటి కుక్కతో సంబంధం పెట్టుకుందని దాని యజమానికి కోపం వచ్చింది. పరువుకు సంబంధించిన విషయం అనుకున్నారో ఏమో... వెంటనే ఆ శునకాన్ని రోడ్డు మీద వదిలి వెళ్లిపోయారు.
అక్రమ సంబంధం వల్లే....
తిరువనంతపురంలో రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో ఉన్న పొమెరేనియన్ జాతి శునకాన్ని స్థానికులు గమనించారు. అనంతరం జంతు పరిరక్షణ వాలంటీర్కు సమాచారం అందించారు. ఆ శునకాన్ని అక్కున చేర్చుకున్న వాలంటీర్కు దాని మెడలో ఓ లేఖ కనపడింది.
'ఈ శునకం ఎంతో మంచిది. ఆహారం ఎక్కువ తినదు. ఇది పొరుగింటి కుక్కతో సంబంధం పెట్టుకుందనే కారణంతోనే దీన్ని వదిలేస్తున్నా' అని ఆ లేఖలో ఉంది.