లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం నిష్పక్షపాతంగా సభను నిర్వహిస్తానని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత లోక్సభలో సభ్యులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నియమ నిబంధనల ప్రకారం సభను విజయవంతంగా నడిపిస్తానని ఎంపీలకు హామీ ఇచ్చారు.
పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓం బిర్లా ప్రశంసించారు. ప్రభుత్వం సభలో మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీ తనంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరి మాటలను సభ వింటుందని అన్నారు.
సభను సజావుగా నిర్వహించేందుకు సభ్యులందరూ సహకరించాలని సభాపతి బిర్లా కోరారు. ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రశ్నలనే లేవనెత్తాలని సూచించారు.
"నాపై నమ్మకముంచి ఎన్నికలో మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. నేను కూడా 2014 నుంచి 2019 వరకు మీ మధ్యే కూర్చున్నా. లక్షల మంది ప్రజల మద్దతుతో.. వారి విశ్వాసం, భరోసాలతో ఈ సభలో అడుగుపెడతాం. సభలోకి వచ్చాక ప్రజల స్వరం సభలో వినిపిస్తామని మన నియోజకవర్గ ప్రజలు, మొత్తం దేశం ప్రజలు ఆకాంక్షిస్తారు. అన్ని పార్టీలు విశ్వాసం వ్యక్తం చేసినట్టు సభాపతి పీఠం నిష్పక్షపాతంగా ఉండాలి. ఉంటుంది. సభ్యులందరూ నాకు ఇచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ.. విధులను సమర్థంగా నిర్వహిస్తా. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సభను నడుపుతా. మీరూ సహకరిస్తారని నమ్ముతున్నా. మీరు నిశ్చింతగా ఉండండి. పార్టీల సంఖ్య సభలో ఏ విధంగా ఉన్నా మీ స్వరాన్ని వినిపించేలా చూడటమే కాక, మీ ప్రయోజనాలను సంరక్షించే బాధ్యత నాది. " - ఓం బిర్లా, లోక్సభ స్పీకర్
ఇదీ చూడండి : 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై అఖిలపక్షం భేటీ