దేశం మొత్తం మీద ప్రధానంగా 15 జిల్లాలోనే 60 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు నిరంతర పర్యవేక్షణతో పాటు పరీక్షల నిర్వహణ, చికిత్స అందించడం, వైరస్‌ను అదుపు చేయడంలో మరింత దూకుడుగా వ్యవహరించడం వంటివి చేయాలని చెప్పారు అమితాబ్.
జిల్లాలు ఇవే..
ఈ మేరకు నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రతకు సంబంధించి ఒక నివేదికను రూపొందించింది. ఈ జాబితాలో హైదరాబాద్(తెలంగాణ), పుణే(మహారాష్ట్ర), జైపూర్(రాజస్థాన్), ఇండోర్(మధ్యప్రదేశ్), అహ్మదాబాద్(గుజరాత్), ముంబయి(మహారాష్ట్ర), దిల్లీ, వడోదరా(గుజరాత్), కర్నూల్(ఆంధ్రప్రదేశ్), భోపాల్(మధ్యప్రదేశ్), జోధ్‌పుర్(రాజస్థాన్), ఆగ్రా(ఉత్తర్‌ప్రదేశ్), ఠాణే(మహారాష్ట్ర), చెన్నై(తమిళనాడు), సూరత్(గుజరాత్) జిల్లాలున్నాయి. వీటిలో మొదట పేర్కొన్న 7 జిల్లాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉందని అమితాబ్ కాంత్ తెలిపారు.
దేశం మొత్తం మీద దిల్లీలోని 11 జిల్లాల్లోనే 12.62 శాతం కేసులు నమోదయ్యాయని అమితాబ్‌కాంత్ వెల్లడించారు. కరోనా పోరులో భారత్ ఎంత మేర విజయం సాధిస్తుందనేది ఈ జిల్లాల్లో తగ్గుదల మీదే ఆధారపడి ఉంటుదని చెప్పారు.
'దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని వెల్లడించడం మా బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలే కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, వైరస్ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించడం ద్వారా కేసుల తీవ్రతను తగ్గించుకోవాలి. భారత్‌లోని 60 శాతానికిపైగా కేసులు 15 ప్రాంతాల్లో నమోదయ్యాయి. కరోనాపై పోరులో విజయం సాధించాలంటే ఆ శాతాన్ని తగ్గించుకుంటూ రావాలి.'