సుప్రీంకోర్టు శబరిమలకు మహిళలందరినీ అనుమతించిన నేపథ్యంలో పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్ల బాలిక అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే తండ్రితో కలిసి స్వామిని దర్శించుకోవాలని చూసిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. బుకింగ్ సమయంలో బాలిక వయసును తల్లితండ్రులు తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించారు. చిన్నారి ఆధార్ కార్డును తనిఖీ చేసిన పోలీసులు బాలిక వయసు 12 ఏళ్లని గుర్తించారు. ఫలితంగా ఆమెను పంబా నుంచి ముందుకు అనుమతించలేదు. ఆలయ పరిసరాల్లో తాజా పరిస్థితులను వివరించి.. బాలిక కుటుంబసభ్యులను మాత్రమే దర్శనానికి అనుమతించారు.
మళ్లీ యాభై ఏళ్లకు వస్తాను
శబరిమల పుణ్యక్షేత్ర ఆచారాన్ని పాటిస్తూ.. సంప్రదాయాలను కాపాడాలని కేరళకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక వినూత్న ప్రయత్నం చేసింది. మంగళవారం దర్శనానికై విచ్చేసిన ఆ బాలిక.. 50 ఏళ్లు వచ్చిన తర్వాతే మళ్లీ దర్శనానికి వస్తానని తన మెడలో ప్లకార్డు ధరించింది.