తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2019, 7:01 AM IST

ETV Bharat / bharat

'కురుక్షేత్రం'లో లాల్​ కుటుంబాలు 'మార్క్'​ చూపేనా!

హరియాణాలో ఈ నెల 21న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన చౌదరి దేవీలాల్​, బన్సీలాల్​, భజన్​లాల్​​ కుటుంబాల నుంచి దాదాపు 10 మంది నేతలు ఈ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో వీరి ప్రభావం ఏ మేర ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'కురుక్షేత్రం'లో లాల్​ కుటుంబాలు 'మార్క్'​ చూపేనా!

చౌదరి దేవీలాల్​, బన్సీ లాల్, భజన్​ లాల్... హరియాణా రాజకీయాల్లో కీలక శక్తులు. 1996లో పంజాబ్​ నుంచి విడిపోయి హరియాణా రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 30 ఏళ్ల పాటు ఈ ముగ్గురే​ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.​ రెండున్నర పుష్కర కాలాల పాటు హరియాణాను పరిపాలించి తమ కుటుంబాలకు ప్రత్యేక వారసత్వాన్ని అందించారు. ఆ వారసత్వాన్నే ఆసరాగా చేసుకుని... ఆ 3 కుటుంబాలకు చెందిన 10 మంది ఈ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

దేవీలాల్​ కుటుంబం నుంచి...

మాజీ ఉప ప్రధాని, హరియాణా మాజీ ముఖ్యమంత్రి 'దేవీలాల్'​ కుటుంబం నుంచి.. అతిపిన్న వయసులోనే ఎన్నికల బరిలోకి దిగిన నేతగా గుర్తింపు పొందారు ఆయన ముని మనువడు దుష్యంత్​ చౌతాలా. 31 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన... 2014 పార్లమెంట్​ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హిసార్​ లోక్​సభ ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు. అయితే 2018లో అధికార కలహాలతో స్వయానా అయన తాత ఓం ప్రకాశ్​ చౌతాలా దుష్యంత్​ను ఐఎన్​ఎల్​డీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా 2018 డిసెంబర్​ 9న 'జన్​ నాయక్​ జనతాపార్టీ (జేజేపీ)'ని స్థాపించారు దుష్యంత్​.

ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఉచానా కలన్​ నియోజక వర్గం నుంచి మాజీ కేంద్రమంత్రి చౌదరి బీరేందర్​ సింగ్​ భార్య, సిట్టింగ్​ ఎమ్మెల్యే ప్రేమ్​లతపై దుష్యంత్ పోటీ చేస్తున్నారు​. దుష్యంత్ తల్లి 'నైనా చౌతాలా' జేజేపీ అభ్యర్థిగా బాధ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో దబ్​వాలీ స్థానంలో పోటీ చేసిన ఆమె.. ఐఎన్​ఎల్​డీ పార్టీ తరఫున విజయం సాధించారు.
ఓం ప్రకాశ్ కుమారుడైన ఐఎన్​ఎల్​డీ నేత, 'ఎల్లనబాద్​' సిట్టింగ్​ ఎమ్మెల్యే అభయ్​ సింగ్​ చౌతాలా మరోసారి అదే స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

దేవీలాల్​ నలుగురు కుమారుల్లో ఒకరైన జగదీశ్​ చౌతాలా కుమారుడు ఆదిత్య సింగ్​ చౌతాలా భాజపా అభ్యర్థిగా దబ్​వాలీ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనున్నారు. దేవీలాల్​ మరో కుమారుడు రంజిత్​ సింగ్​ చౌతాలా(73) కూడా ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్​ ఆయనకు సీటు ఖరారు చేయనందున రనియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు.

భజన్​లాల్​ కుటుంబం​

హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్​లాల్​ కుటుంబం పరిస్థితి మరోలా ఉంది. ఆయన ఇద్దరు కుమారులైన కుల్దీప్​ బిష్​నాయ్​, చాందెర్​ మోహన్​ కాంగ్రెస్​ అభ్యర్థులుగా ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు. ఆదాంపుర్​, పంచకుల నియోజకవర్గాల నుంచి ఇప్పటికే నామినేషన్​ దాఖలు చేశారు. వీరిలో చాందెర్​ మోహన్​ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హరియాణాకు ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.

బన్సీలాల్​ X దేవీలాల్​ కుటుంబం​

బన్సీలాల్​ కుటుంబానికి వస్తే... ఆయన కుమారుడు రణ్​బీర్​ సింగ్​ మహేంద్ర(75)కు కాంగ్రెస్​ బాధ్రా సీటు ఖరారు చేసింది. అదేస్థానంలో దుష్యంత్ తల్లి నైనా చౌతాలా జేజేపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో బాధ్రా స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేశారు మహేంద్ర.
బన్సీలాల్​ కోడలు, కాంగ్రెస్​ సీనియర్​ నేత కిరణ్​ చౌదరి 'తోషమ్'​ నియోజకవర్గంలో పోటీకి సిద్ధమయ్యారు. బన్సీ అల్లుడు సోమ్​వీర్​ సింగ్​ కూడా కాంగ్రెస్​ తరఫునే ఎన్నికల బరిలో దిగుతున్నారు. 'లోహరు' సీటును సోమ్​వీర్​కు కేటాయించింది హస్తం పార్టీ.

2018లో రెండుగా విడిపోయిన పార్టీ

దేవీలాల్​ స్థాపించిన ఇండియన్​ నేషనల్ లోక్​దళ్​(ఐఎన్​ఎల్​డీ)లో ఆధిపత్యం కోసం ఆయన ఇద్దరు మనువళ్లు అజయ్​ చౌతాలా, అభయ్​ చౌతాల మధ్య తీవ్రస్థాయిలో పోరు నడిచింది. అజయ్​తో పాటు ఆయన కుమారులు దుష్యంత్​, దిగ్విజయ్​ను పార్టీ నుంచి బహిష్కరించారు ఓం ప్రకాశ్​ చౌతాలా. ఫలితంగా ఐఎన్​ఎల్​డీ పార్టీ 2018లో రెండుగా విడిపోయింది.

అదృష్టం ఎవరికో...

ఒకప్పుడు హరియాణా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన 3 కుటుంబాల పరిస్థితి... అంతర్గత కలహాలతో మారిపోయింది. ఫలితంగా గత 15 ఏళ్లుగా ప్రజల్లో వీరి ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రంలో వారి ప్రభావం ఎంత ఉంటుందో వేచిచూడాలి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details