తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎం పదవికి బొమ్మై రాజీనామా.. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ.. ఆదివారమే ఆ మీటింగ్

కర్ణాటక సీఎం పదవికి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేశారు. గవర్నర్ తన రాజీనామాను ఆమోదించారని బొమ్మై వెల్లడించారు. ఫలితాల అనంతరం బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ సభలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. భాజపాముక్త సౌత్‌ఇండియా నిజమైందన్నారు.

basavaraj-bommai-resigns-as-a-karnataka-cm-ofter-congress-won-in-assembly-election-2023
సీఎం పదవికి బొమ్మై రాజీనామా

By

Published : May 13, 2023, 9:59 PM IST

Updated : May 13, 2023, 10:58 PM IST

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​ సావర్ చంద్​ గెహ్లాట్​ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తన రాజీనామాను గవర్నర్ ఆమోదించారని బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఎన్నికల ఫలితాల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేశారు బొమ్మై.

కర్ణాటక గవర్నర్​కు రాజీనామా అందిస్తున్న బొమ్మై

అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓటమికి తానే బాధ్యుడినని చెప్పారు. ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించుకొని.. 2024లో జరిగే లోక్​సభ ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా పని చేస్తామని అన్నారు. ఎన్నికల్లో హస్తం పార్టీ సరైన ప్రణాళికతో వ్యవస్థీకృతంగా పని చేసిందని, వాటిని ఛేదించడంలో బీజేపీ నేతలు వైఫల్యం చెందారని బొమ్మై చెప్పుకొచ్చారు.

"ప్రజలు ఇచ్చిన తీర్పును నేను గౌరవిస్తున్నా. బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. పార్టీ పరాజయానికి ఎవరూ బాధ్యులు కాదు. ప్రజా వ్యతిరేకత మాత్రమే కాదు.. ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా విశ్లేషించుకోవాలి. నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై విశ్లేషణ చేసుకుంటాం. పార్టీకి ఎదురైన అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్తాం. మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఉంది. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో మేమేంటో రుజువు చేసుకుంటాం."
-బసవరాజ్ బొమ్మై

మోదీ ప్రభావం లేదా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటనల ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో కనిపించలేదు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. బొమ్మై ఘాటుగా స్పందించారు. 'ఓటమికి చాలా కారణాలుంటాయి. సమస్యను క్షుణ్నంగా విశ్లేషించిన తర్వాతే ఎవరైనా మాట్లాడాలి. అంతేగానీ నోటికి వచ్చింది మాట్లాడటం కరెక్ట్ కాదు' అని సమాధానం ఇచ్చారు బొమ్మై.
రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు గెలుపొందిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారించింది. ఆదివారం బెంగళూరులో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని ప్రకటించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యులు చర్చించనున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

భాజపాముక్త సౌత్‌ఇండియా నిజమైంది: ఖర్గే..
ఫలితాల అనంతరం బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ సభలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఇదో అపూర్వ విజయన్నారు. ఈ విజయం వల్ల దేశంలోనే కొత్త శక్తి ఉద్భవించిందని తెలిపారు. కాంగ్రెస్‌ ముక్తభారత్‌ చేస్తామంటూ భాజపా ఎప్పుడూ తమను అంటుండేదని గుర్తు చేసిన ఆయన.. కానీ ఇప్పుడు భాజపాముక్త సౌత్‌ఇండియా నిజమైందని వ్యాఖ్యానించారు. అహం ఎక్కువ కాలం నిలవదన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. మనం ప్రజల మాట వినాలని ఖర్గే సూచించారు. సరైన మార్గం చూపే ప్రజల ముందు తల వంచాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ విజయం కర్ణాటక రాష్ట్ర ప్రజలందరిదని, వాళ్లే నిర్ణయం తీసుకుని తమను విజయం కట్టబెట్టారని ఖర్గే వెల్లడించారు. కాబట్టే కాంగ్రెస్‌కు 36 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో 136 సీట్లు వచ్చాయని తెలిపారు.

Last Updated : May 13, 2023, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details