Azadi Ka Amrit Mahotsav: యుద్ధాల్లో రాకెట్ల వాడకం కొత్తేమీ కాదు. మన పురాణాల్లోని ప్రస్తావనను పక్కనపెడితే.. 13వ శతాబ్దంలో చైనీయులు తమపై దాడి చేసిన మంగోలులపై రాకెట్లు ప్రయోగించారు. 15వ శతాబ్దంలో యూరోపియన్లు-మొఘలుల మధ్య యుద్ధాల్లోనూ ఇవి కనిపించాయి. కానీ ఇవన్నీ దీపావళికి పేల్చే టపాసుల్లాంటివి మాత్రమే.
మైసూరు రాజు టిప్పు సుల్తాన్ మాత్రం ప్రపంచంలో తొలిసారిగా ఇనుముతో తయారు చేసిన రాకెట్లను విజయవంతంగా ప్రయోగించాడు. స్తూపాకారంలో ఇనుప గొట్టాల్లా తయారు చేసి, వాటిలో పేలుడు పదార్థాలు నింపి.. గరిష్ఠంగా 2 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించేలా వీటిని రూపొందించారు. మైసూరులో దొరికే అత్యంత నాణ్యమైన ఇనుముతో రాకెట్లను తయారు చేయటానికి టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్యంలో నాలుగు చోట్ల ప్రయోగశాలలు ఏర్పాటు చేశాడు. వీటికి తారామండల్‌పేటలు అని పేరు పెట్టారు. వీటిలో రాకెట్ టెక్నాలజీపై పరిశోధన, ఉత్పత్తి జరిగేది. ఇక్కడ తయారైనవాటిని ఎడ్లబండ్లకు ఏటవాలుగా కట్టి ఒకేసారి డజన్ రాకెట్లను ప్రయోగించేలా సిద్ధం చేసేవారు. కొన్నింటిని వెదురుబొంగులకు కట్టి ప్రయోగించేవారు. వీటికోసం 5వేల మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి రాకెట్ ఆర్టిలరీ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేశారు.
యుద్ధాల్లో.. ముఖ్యంగా 1780లో జరిగిన రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో టిప్పు సైన్యం ఈ రాకెట్లను ప్రయోగిస్తే ఆశ్చర్యపోవటం ఆంగ్లేయుల వంతైంది. తమపై పడుతున్నవి ఏంటో అర్థంగాక తెల్లవారు తెల్లబోయారు. కొన్ని నేరుగా పేలుతుంటే.. మరికొన్ని భూమిపై తిరిగి పైకిలేచి కొద్దిసేపటికి పేలేవి. దీంతో ఏమీ అర్థంగాక అయోమయంలో యుద్ధరంగం నుంచి పారిపోయారు. తర్వాతికాలంలో వాటర్‌లూ యుద్ధంలో నెపోలియన్‌ను ఓడించటంలో కీలకపాత్ర పోషించిన ఆర్థర్ వెలెస్లీ సైతం టిప్పూ సైన్య రాకెట్లకు భయపడి పారిపోయాడు. 1799లో శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆంగ్లేయులు టిప్పూ ఆయుధాగారానికి వెళ్లగా 600 రాకెట్ లాంచర్లు, 700 సిద్ధంగా ఉన్న రాకెట్లు, 9వేల ఖాళీ రాకెట్లు దొరికాయి. వీటిలో చాలావాటిని ఇంగ్లాండ్‌లోని తమ ఆయుధ ప్రయోగశాలకు పంపించారు. టిప్పూ రాకెట్లను స్ఫూర్తిగా తీసుకొని ఆంగ్లేయులు 1800 నాటికి ఆధునిక రాకెట్లను రూపొందించారు. వీటినే.. 1815లో జరిగిన వాటర్‌లూ యుద్ధంలో ఫ్రాన్స్ వీరుడు నెపోలియన్ బోనాపార్టిపై బ్రిటన్ ప్రయోగించి ఓడించింది. ఐరోపా చరిత్రలో అత్యంత కీలకమైన యుద్ధాన్ని నెగ్గింది. శ్రీరంగపట్నంలో టిప్పు రాకెట్లను చూసి భయపడ్డ వెలెస్లీయే వాటర్‌లూ యుద్ధంలో వీటి వాడకంలో భాగమయ్యాడు. గమ్మత్తు ఏమిటంటే నెపోలియన్‌తో టిప్పు సుల్తాన్‌కు మంచి సంబంధాలుండేవి. వీరిద్దరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలను ఆంగ్లేయులు నిఘావేసి రహస్యంగా సేకరించారు. చివరకు తన స్నేహితుడు టిప్పూ రూపొందించిన రాకెట్లే నెపోలియన్ పరాజయానికి కారణమవటం యాదృచ్ఛికం.
రాకెట్ డిజైన్లను భారత్ నుంచి కాపీ కొట్టినప్పటికీ వాటి ఆవిష్కరణను బ్రిటన్ తమ ఖాతాలో వేసుకోవటంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో.. 1807లో ఇంగ్లాండ్ శాస్త్రవేత్త కాంగ్రెవ్ నిజాన్ని అంగీకరించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన రాకెట్ల డిజైన్‌తో స్ఫూర్తి పొందే ఆధునిక రాకెట్లను రూపొందించామన్నారు. మిసైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం కూడా శ్రీరంగపట్నం మిసైల్ చరిత్రపై ఆసక్తి చూపించేవారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో.. టిప్పు కాలంనాటి రాకెట్ ప్రయోగశాలను ఓ మ్యూజియంగా మార్చాలని యోచించారు.
ఇదీ చదవండి:Azadi Ka Amrit Mahotsav: పేరుకే రాజధాని.. బ్రిటిష్‌కు వేసవి విడిది!