Ayodhya Ram Mandir Nepal Gifts :అయోధ్యలో మరికొద్ది రోజుల్లో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసింది రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్. కాగా, సీతాదేవి పుట్టిన ప్రదేశమని ప్రజలు నమ్ముతున్న నేపాల్‌లోని జనక్‌పుర్ నుంచి తెచ్చిన 1100 కానుకలను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌కు అందించారు జానకి దేవాలయ పుజారి మహంత్ రామ్ రోషన్. ఆయన శుక్రవారం నేపాల్ నుంచి బయలుదేరి శనివారం అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు బట్టలు, ఆభరణాలు, వెండి పాత్రలు, ఇతర వస్తువులను అందించారు.
రాముడి విగ్రహాన్ని అయోధ్యలో మరికొద్ది రోజుల్లో ప్రతిష్ఠనుండడం పట్ల జనక్‌పురి ప్రజలు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లోని జానకి ఆలయం నుంచి చీరలు, ధోతీ, ఆభరణాలు, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్, పలు రకాల మిఠాయిలు పంపించారు. ఇప్పటికే నేపాల్ నుంచి అయోధ్య రామాలయానికి సాలిగ్రామ రాయి, పవిత్ర జలం చేరాయి. కాగా జనవరి 22న జరిగే రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలని రామ్ జానకి ఆలయం, పశుపతినాథ్ ఆలయం పూజారులు సహా సాధువులకు ఆహ్వానం పంపింది ఆలయ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్.
'భారీ ధ్వజస్తంభం ఏర్పాటు'
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తయారుచేసిన ధ్వజస్తంభాలను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేయనున్నారు. గోటా ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో 7 ధ్వజస్తంభాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో ప్రధాన ధ్వజస్తంభం బరువు 5500కిలోలు కాగా, ఎత్తు 44అడుగులు. ఈ స్తంభం కాకుండా మిగతా ఆరు 20 అడుగుల ఎత్తు, 700 కిలోల బరువైనవి.