భారత్- చైనా సరిహద్దుల్లో తూర్పు లద్దాఖ్ వద్ద గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నాలు రోజురోజుకు సఫలీకృతమవుతున్నాయి. ఈ చర్చల్లో మరిన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి మరలించాలని ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మాల్దో స్థావరంలో శనివారం ప్రారంభమైన 10వ విడత చర్చలు ఆదివారం తెల్లవారుజామున వరకు కొనసాగాయి. దాదాపు 16 గంటల పాటు.. ఇరు దేశాల కోర్ కమాండర్ల మధ్య చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్, చైనా తరపున ల్యూ లిన్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. ఇరుదేశాల సరిహద్దుల్లోని దేప్‌సంగ్, పెట్రోలింగ్ పాయింట్ 15, గోగ్రా, దెమ్‌చొక్ వంటి ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది.
మరోసారి చర్చలు..
ఈ చర్చల్లో గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్ నుంచి బలగాల ఉపసంహరణపై ఏకాభిప్రాయానికి రాగా దేప్‌సంగ్, దెమ్‌చొక్‌లపై ఇంకా ఒప్పందం కుదరలేదని సమాచారం. బలగాల ఉపసంహరణపై ఇరు పక్షాలు విధివిధానాలను సమర్పించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అయితే, ప్రతిపాదనలను ఉన్నతస్థాయిలో పరిశీలనకు పంపినట్లు వెల్లడించాయి. దీనిపై మరో విడత చర్చలు కొనసాగుతాయని చెప్పాయి. 2013 తర్వాత దేప్‌సంగ్ ప్రాంతంపై చైనా చర్చలకు రావడం ఇదే తొలిసారి.
ఆ ప్రాంతమే వివాదాస్పదం..
దేప్‌సంగ్ ప్రాంతంలో పెట్రోలింగ్ పాయింట్లు 10, 11, 11ఏ, 12, 13 లకు వెళ్లకుండా భారత గస్తీదళాలను చైనా అడ్డుకుంటోంది. మోల్డోలో చర్చకు వచ్చిన 4 ఘర్షణాత్మక ప్రాంతాల్లో దేప్‌సంగ్ వివాదాస్పదమైనదని రక్షణ నిపుణులు చెబుతుంటారు. దేప్‌సంగ్‌లో వై జంక్షన్‌కు సమీపంలో వాస్తవాధీన రేఖ బార్బాద్ మోర్చా ప్రాంతం గుండా వెళ్తుందన్న చైనా వాదనను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ పీఠభూమి ప్రాంతం భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైనది. దౌలత్ బేగ్ ఓల్డీ వైమానిక స్థావరానికి, కారకోరం పర్వతశ్రేణికి వెళ్లే మార్గాలు ఈ పీఠభూమి ప్రాంతంలో ఉంటాయి.
హాట్‌స్ప్రింగ్స్ వద్ద ఉన్న పెట్రోలింగ్ పాయింట్ 15, గల్వాన్‌లోని పెట్రోలింగ్ పాయింట్ 14, గోగ్రాలోని 17 A వంటి ఘర్షణాత్మక ప్రాంతాలపై పరిష్కారానికి రావడం సులభమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెట్రోలింగ్ పాయింట్ 15, 17ఏ వద్ద చైనా సైనికులు తిష్టవేసుకుని ఉన్నారు. వీరు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లాలని భారత సైన్యం చెబుతోంది. అటు.. చార్దింగ్-నింగ్‌లుంగ్, నల్లా- దెమ్‌చొక్ ప్రాంతాల్లో చైనా సైన్యం గుడారాలను ఏర్పరుచుకొని లద్దాఖ్ ప్రాంతం వారిని పశువుల మేతకు వెళ్లనీయకుండా అడ్డుకుంటోంది.
ఇదీ చూడండి:ల్యాండ్‌మైన్ పేలి బీఎస్ఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలు