Girl falls in nala in Hyderabad : రోజూలాగే ఆ చిన్నారి ఇవాళ కూడా నిద్రలేచింది. రోజూ ఉక్కపోతతో నిద్రలేచే ఆ పాప.. ఇవాళ వర్షం కురవడంతో చల్లగా అనిపించి కాస్త త్వరగా మేల్కొంది. లేవగానే కిచెన్లో తన పనిలో నిమగ్నమయిన తల్లి వద్దకు వెళ్లింది. 'అమ్మా'.. అంటూ తల్లిని అమాంతం వాటేసుకుంది. 'అమ్మా.. నాకు ఆకలేస్తోంది' అని తల్లితో చెప్పగా.. ఆ తల్లి 'సరే అమ్మా.. జనరల్ స్టోర్కు వెళ్లి పాల ప్యాకెట్, అలాగే నీకు నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తీసుకురమ్మని' కూతురికి డబ్బులిచ్చి పంపించింది. ఆకలిగా ఉన్నా ఆ బుజ్జాయి.. తల్లి తనకు నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోమని చెప్పగానే హుషారుగా తన సోదరుడితో కలిసి షాప్ వైపునకు పరుగుతీసింది.
Baby falls in nala in Secunderabad : అయితే బయట అడుగుపెట్టగానే అంతా చిందరవందరగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి ఆ ప్రాంతమంతా కాస్త బురదమయమైంది. అందుకే ఈ పాప తన అన్న చేయి పట్టుకుని ఆచితూచి అడుగులో అడుగు వేసుకుంటూ దుకాణం వైపు నడక ప్రారంభించింది. దారిలో రోడ్డుపైన మొత్తం నీళ్లు నిలిచిపోయాయి. అందులో నుంచి వెళ్లాలని తనకు అనిపించినా.. నీళ్లలో తడిస్తే అమ్మ తిడుతుందని భయపడి.. పక్కనే ఉన్న డ్రైనేజీ నాలాపైన భాగంలో ఇద్దరూ నడవడం షురూ చేశారు. అయితే ఆ నాలా కాస్త చిన్నగా ఉండటంతో పక్కపక్కన కాకుండా.. ఒకరి వెనక ఒకరు నడిచారు. అలా ముందు పాప వెళ్తుండగా వెనక ఆమె సోదరుడు వెళ్తున్నాడు.
ఇంకాసేపట్లో షాపు వద్దకు చేరుకుని తనకు నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటానని హాయిగా వెళ్తున్న ఆ చిన్నారి.. తనకు అడుగు దూరంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది. తను నడుస్తున్న నాలా పైభాగంలో రంధ్రం ఉన్న సంగతి గమనించలేదు ఆ బుజ్జాయి. రంధ్రాన్ని గమనించకుండా ఒక్కసారిగా దానిపై అడుగు వేయడంతో నాలా పైభాగం ఊడిపోయి ఆ పాప అందులో పడిపోయి కొట్టుకుపోయింది. గమనించిన ఆమె సోదరుడు షాకయ్యాడు. చెల్లి.. చెల్లి అంటూ అరుచుకుంటూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌లో కురిసిన వర్షానికి నాలాలో పడి 11ఏళ్ల మౌనిక అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కళాసిగూడలో నివాసం ఉండే.. శ్రీనివాస్, రేణుక దంపతుల కుమార్తె మౌనిక తన సోదరుడితో కలిసి ప్రతిరోజూలాగే పాల ప్యాకెట్ కొని తెచ్చేందుకు వెళ్లింది. అయితే భారీ వర్షం కురవడంతో ఇంటి సమీపంలో నీరు రోడ్డుపై నిలిచింది. పక్కనే నాలాపై కప్పుపై రంధ్రం పడింది. ఈ విషయం గమనించని చిన్నారి మౌనిక నడుచుకుంటూ వెళ్లి అందులో పడిపోయింది. ఆ చిన్నారి అన్న విషయాన్ని పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు చెప్పాడు.
తల్లిదండ్రులు స్థానికులతో కలిసి ఆ ప్రాంతంలో గాలించారు. జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందిచగా డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి గాలించాయి. సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న నాలాలో మృతదేహం బయటపడింది. అయితే ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో సోదరుడు కిందపడిపోతే... చెల్లి మౌనిక పైకి లేపింది. మళ్లీ ఇద్దరూ నడుస్తుండగా ఒక్కసారిగా చిన్నారి నాలాలో పడి కొట్టుకుపోయి మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో నమోదు అయ్యాయి.
మౌనిక మృతిచెందిన ఘటనాస్థలిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు. మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన మేయర్... పలుమార్లు హెచ్చరించినా అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల అసహనం వ్యక్తంచేశారు. చిన్నారి మౌనిక కుటుంబానికి మేయర్ పరామర్శించి.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
ఇవీ చదవండి: