తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా సాగుతున్న జగన్‌ - 381వ సారి వాయిదా

381st Adjournment in YS Jagan CBI Case: అవినీతి జన్మ నక్షత్రంగా అక్రమార్జన పుట్టుమచ్చగా ప్రలోభాలకు లోనైన పారిశ్రామిక వేత్తలే ఆలంబనగా పుట్టిందే జగతి పబ్లికేషన్స్‌! జగన్‌ అరాచకపు ఎత్తుగడలు, విజయసాయిరెడ్డి అక్రమ వ్యూహాలను కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ పక్కా ఆధారాలతో ఎండగట్టింది. న్యాయస్థానానికి అభియోగపత్రాలూ సమర్పించింది. అలాంటి కేసును తేల్చనీయకుండా విచారణ ముందుకు సాగకుండా పుష్కరకాలంగా సాగదీస్తున్నారు వాయిదాల వీరుడు జగన్‌. సీబీఐ కేసు 381సార్లు, ఈడీ కేసు 251సార్లు వాయిదా పడ్డాయంటే ఆయన ఘనత అర్థం చేసుకోవచ్చు! తాజాగా జగతి పబ్లికేషన్స్‌ కేసు శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణకు రాగా మళ్లీ ఫిబ్రవరి 15కు వాయిదా పడింది.

jagan_cbi_cases
jagan_cbi_cases

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 7:37 AM IST

సీబీఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా సాగుతున్న జగన్‌ - 381వ సారి వాయిదా

381st Adjournment in YS Jagan CBI Case:ఏ ముఖ్యమంతైనా పారిశ్రామికవేత్తలతో సమావేశమైతే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండంటారు వీలైనన్ని రాయితీలిస్తామంటారు కానీ, వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రం మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి దానికంటే ముందు నా కుమారుడి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టండన్నారు. జగన్‌ కంపెనీల్లో వాటా పెట్టిన వారికే రాయితీలిచ్చారు. అవినీతిలో కొత్త అంకానికి తెరలేపారు. అరాచకంలో సృజనాత్మకతను ఆవిష్కరించారు. సాక్షి జగన్‌ సొంత పత్రిక. కానీ, అక్రమాల పుత్రిక. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులన్నీ మోసపూరితం. రాష్ట్రంలో పారిశ్రామికరంగ అభివృద్ధి, తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దేశ, విదేశాల్లో జరిగే వాణిజ్య సదస్సుల్లో పాల్గొని రాష్ట్రానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం, వారి ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం పాలకుడి బాధ్యత. కానీ, అప్పటి సీఎం వైఎస్‌ దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు.

రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తల నుంచి తన కుమారుడి కంపెనీల్లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించుకున్నారు. ఈ వ్యవహారాల్లో వై.ఎస్‌.జగన్‌కు వారి కుటుంబ ఆడిటర్‌ అయిన విజయసాయిరెడ్డి పూర్తిస్థాయిలో అండగా నిలిచారు. ప్రతిఫలంగా నాటి సీఎం వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి, సాయిరెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవిని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించుకున్నారు. వీటితోపాటు ఏకంగా రిజర్వు బ్యాంకు డైరెక్టర్‌ పదవికీ కేంద్రానికి సిఫారసు చేశారంటేనే వారి మధ్య బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సీఎం జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో జగతి పబ్లికేషన్స్‌లో అక్రమ మార్గంలో పెట్టుబడులను పెట్టించారనేది ఒకటి.

ఆయన తండ్రి సీఎంగా పని చేసినప్పుడు చెన్నైలో జరిగిన సమావేశంలో వైఎస్‌ ఇచ్చిన ఆహ్వానం మేరకు జయలక్ష్మి టెక్స్‌టైల్స్‌ అధినేత టి.ఆర్‌.కన్నన్‌ ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో సిమెంట్‌ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకొచ్చారు. అయితే ఎలాంటి సమస్యలు లేకుండా వ్యాపారం నిర్వహించుకోవాలంటే మొదట వైఎస్‌ తనయుడైన జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని విజయసాయిరెడ్డి హుకుం జారీ చేశారు. దాంతో 2008లో కన్నన్‌ 5 కోట్ల రూపాయలను జగతికి బదిలీ చేశారు. దుబాయ్‌లో ఇండియన్‌ బిజినెస్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో బెంగళూరుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ మాధవ్‌ రామచంద్రకు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వై.ఎస్‌. సూచించారు.

Jagan Illegal Assets Case: జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం.. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు

అనంతరం రామచంద్రకు సాయిరెడ్డి ఫోన్‌ చేసి త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లనున్న జగతి పబ్లికేషన్స్‌కు లాభాలు రానున్నాయని, అందులో పెట్టుబడి పెట్టాలన్నారు. దీంతో ఆయన తన కంపెనీ నిధులు 10 కోట్లు, స్నేహితుడి వద్ద 9.66 కోట్లు రూపాయలను రుణంగా తీసుకుని మొత్తం 19.66 కోట్లను జగతిలో పెట్టుబడి పెట్టారు. అవనీంద్ర కుమార్‌ దండమూడి నుంచి జగతి ప్రతినిధి శ్రీధర్‌ 10 కోట్ల రూపాయల పెట్టుబడిని రాబట్టారు. తాను పెట్టుబడి పెట్టిన కంపెనీ ఏస్థాయిలో ఉందో తెలుసుకునేందుకు శ్రీధర్‌ను కలవడానికి దండమూడి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అలాగే ఇప్పటివరకు తమకు ఎలాంటి డివిడెండ్‌ అందలేదని, పెట్టుబడీ వెనక్కి రాలేదని సీబీఐకి కన్నన్, మాధవ్‌ రామచంద్రలు వాంగ్మూలాలు ఇచ్చారు.

2011లో అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు రాసిన లేఖతో ఈ అక్రమాల పుట్ట కదిలింది. జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేశారని వివిధ కంపెనీలు ఏర్పాటు చేసుకుని, వాటిలోకి నేరపూరితమైన మార్గాల్లో పెట్టుబడులను వచ్చేలా చూశారని ఆరోపిస్తూ దీనిపై విచారణ చేపట్టాలని శంకర్‌రావు లేఖ రాశారు. దాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కేసు దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దర్యాప్తు అనంతరం సీబీఐ 2011 ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 2012 ఏప్రిల్‌ 23న అభియోగపత్రం దాఖలు చేసింది. అదే ఏడాది జూన్‌ 17న అనుబంధ అభియోగపత్రం సమర్పించింది. అందులో జగతి పబ్లికేషన్స్‌లోకి మోసపూరితంగా పెట్టుబడులు పెట్టించడంలో జగన్, సాయిరెడ్డిలు కీలక పాత్ర పోషించారని పేర్కొంది. ఈ కుట్రలో A-1గా వై.ఎస్‌.జగన్‌ ని, A-2గా వి.విజయసాయిరెడ్డిని, A-3గా జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ను పేర్కొంది. ఈ కేసులో A1, A2లూ ఇద్దరూ అరెస్టు అయి ప్రస్తుతం బెయిలుపై పదేళ్లుగా బయటే ఉన్నారు.

సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 2016 ఆగస్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. జప్తును అప్పిలేట్‌ అథారిటీ తప్పుబట్టగా ప్రస్తుతం అది హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇందులోనూ నిందితులుగా ఎ1గా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా జగతి పబ్లికేషన్స్‌గా చేర్చింది. సీబీఐ కోర్టులో ఉన్న ఈ కేసు విచారణ 251 సార్లు వాయిదా పడింది.

2006 నవంబరు 14న 5 కోట్ల అధీకృత పెట్టుబడి, లక్ష రూపాయల పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌తో విజయసాయిరెడ్డి వ్యవస్థాపక డైరెక్టర్‌గా జగతి పబ్లికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటైంది. దాన్ని 2009 జనవరి 12న జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌గా మర్చారు. మొదట వాటా విలువ 10 రూపాయలతో హరీష్‌ కామర్తి 35 వేలు, విజయసాయిరెడ్డి 35 వేలు, వైఎస్‌ జగన్‌ సన్నిహితుడైన జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి 30 వేలు చొప్పున పెట్టుబడి పెట్టారు. 2006 నవంబరు 21న జగతికి జూబ్లీహిల్స్‌ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఉన్న కరెంట్‌ అకౌంట్‌ ఖాతాల నిర్వహణ బాధ్యతను బోర్డు వైఎస్‌ జగన్‌కు అప్పగిస్తూ తీర్మానం చేసింది. 2007 జూన్‌ 21న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని డైరెక్టర్‌గా నియమిస్తూ అదే రోజు జరిగిన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం జరిగింది.

PIL on Jagan Cases: జగన్ కేసులు త్వరగా తేల్చండి.. తెలంగాణ హైకోర్టులో హరిరామజోగయ్య పిల్

సాయిరెడ్డితో కలిసి అమలు చేసిన కుట్రలో భాగంగా జగన్‌ బయటి వ్యక్తులకు వాటాలను జారీ చేశారు. జగతి పబ్లికేషన్స్‌లో 10 విలువైన వాటాకు 350 రూపాయలని ప్రీమియంగా నిర్ణయిస్తూ 2007 అక్టోబరు 10న తీర్మానం చేశారు. ప్రీమియాన్ని ఇంత భారీగా నిర్ణయించడానికి ఎలాంటి హేతుబద్ధతా లేదు. పైగా కంపెనీ కోసం 50 మందికి పైగా వ్యక్తులు, సంస్థల నుంచి 12వందల 46 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని అక్రమంగా వసూలు చేశారు. అయితే, కంపెనీకి ఎలాంటి మదింపు విలువ నివేదిక లేకుండానే ప్రమోటర్ల నుంచి 350 రూపాయల ప్రీమియంతో ఏకంగా 12వందల 46 కోట్ల రూపాయలు వసూలు చేయడాన్ని సీబీఐ తప్పుబట్టింది. పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, రాంకీ గ్రూప్‌కు చెందిన అయోధ్యరామిరెడ్డి , అరబిందోకు చెందిన నిత్యానందరెడ్డి , హెటిరోకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి, ఇందూ గ్రూపునకు చెందిన ఇందుకూరి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి , ఇండియా సిమెంట్స్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ , పెన్నా గ్రూపు పి.ప్రతాప్‌రెడ్డి తదితరులు జగతి పబ్లికేషన్స్‌లో క్విడ్‌ ప్రోకో పెట్టుబడులు పెట్టినట్లు పలు ఛార్జిషీట్లలో సీబీఐ వెల్లడించింది.

జగన్, విజయసాయిరెడ్డిల కుట్రలో రెండోది జగతి విలువ మదింపు. ఇందుకోసం డెల్లాయిట్‌ సంస్థను నియమించారు. విజయసాయిరెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి జగతి విలువను 3వేల50 కోట్లుగా మదింపు చేయించారు. డెల్లాయిట్‌ ఈ నివేదికను 2008లో ఇచ్చినప్పటికీ ప్రీమియం గురించి ఎలాంటి సలహా ఇవ్వలేదు. జగతి పబ్లికేషన్స్‌ సొంతంగా ప్రీమియం నిర్ణయించింది. అయితే, సాయిరెడ్డి విన్నపం మేరకు సంబంధిత నివేదికను 2007 నవంబరు 16తేదీతో ఇచ్చారు. 2007కు ముందు నుంచి స్వీకరించిన పెట్టుబడులను సమర్థించుకోవడానికే పాత తేదీతో నివేదిక తెప్పించారు. ఇక్కడ తాము చేసిన తప్పును కూడా వారు కప్పిపుచ్చుకోలేకపోయారు. ఎలాగంటే 2007 అక్టోబర్‌ 10న ప్రీమియం విలువ నిర్ణయిస్తే నివేదికపై 2007 నవంబర్‌ 16 తేదీని రాయించుకున్నారు.

Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం

జగతి పబ్లికేషన్స్‌ జగన్‌కే చెందిన కార్మెల్‌ ఏసియాకు అనుబంధ సంస్థగా ఉంది. జగతి పబ్లికేషన్స్‌లో 2012 మార్చి 31నాటికి మొత్తం 12వందల 46 కోట్ల పెట్టుబడి ఉంది. అందులో 11వందల73 కోట్లు అంటే 94శాతం బయటి వ్యక్తులదే. జగతిలో వీరికి వచ్చిన వాటా 30 శాతమే. కేవలం 73 కోట్లు పెట్టుబడి పెట్టిన కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌ మాత్రం 70శాతం వాటాతో యాజమాన్య హక్కులు దక్కించుకుంది. అధిక ప్రీమియం నిర్ణయించి, వాటాల రూపంలో 12వందల 46 కోట్లు వసూలు చేసిన జగతి తన పేరుతో ఎలాంటి ఆస్తులనూ కొనుగోలు చేయలేదు. ప్రచురణ కేంద్రాల్లో భూమి, భవనాలను కూడా సమకూర్చుకోలేదు. జనని ఇన్‌ఫ్రా తనకున్న భూమి, భవనాలను జగతి పబ్లికేషన్స్‌కు అంతే సాక్షికీ లీజుకిచ్చింది.

ఐపీసీ సెక్షన్‌ 120బి రెడ్‌విత్‌ 420, 420, 468, 471, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 9 కింద సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ సెక్షన్‌ల కింద నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8 ప్రకారం పదవిలో ఉన్న వ్యక్తులకు రెండేళ్ల జైలుశిక్ష పడిన పక్షంలో అనర్హత వేటు పడుతుంది. శిక్షాకాలం పూర్తయినా ఆరు సంవత్సరాల వరకూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. జగన్‌ మాత్రం కేసుల విచారణ ముందుకు సాగకుండా ఎన్నో ఎత్తులు వేస్తున్నారు.

ఎఫ్‌ఐఆర్‌నే కొట్టివేయాలంటూ 2012లోనే జగతి పబ్లికేషన్స్‌, జనని ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. దీనికి హైకోర్టు నిరాకరించడంతో ఛార్జిషీట్లలో తమ పేర్లను తొలగించాలని కోరుతూ ఎక్కువ శాతం మంది నిందితులు సీబీఐ కోర్టులో డిశ్ఛార్జి పిటిషన్లు వేశారు. అవి పెండింగ్‌లో ఉండగానే మరికొందరు నేరుగా హైకోర్టును ఆశ్రయించి తమపై ఉన్న కేసులను కొట్టివేయాలని కోరారు. క్వాష్‌ పిటిషన్‌లపై విచారణ పూర్తి అయ్యే వరకూ కేసులపై విచారణ ముందుకు సాగకుండా స్టే పొందారు. నిందితుల్లో ఏ ఒక్కరు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందినా ఆ కేసు మొత్తంపై విచారణ ఆగిపోతుంది. ఇలా వాయిదాలపై వాయిదాలకు పన్నాగం పన్నారు.

ABOUT THE AUTHOR

...view details