Yuvagalam Padayatra Enters into Vijaywada: విజయవాడలోకి యువగళం పాదయాత్ర.. ప్రకాశం బ్యారేజీ పసుపుమయం
Yuvagalam Padayatra Enters into Vijaywada Today: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు(శనివారం) విజయవాడలోకి ప్రవేశించనుంది. నిన్న యాత్రకు విరామం ఇచ్చిన లోకేశ్.. నేడు తాడేపల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుండగా.. తెలుగుదేశం(Telgugdesam) అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామనే హామీల శిలాఫలకాన్ని సీఎం జగన్ నివాసం ఉండే ప్రాంతమైన తాడేపల్లిలో నారా లోకేశ్ ఆవిష్కరించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళానికి.. ప్రకాశం బ్యారేజీ వద్ద గుంటూరు నేతలు ఆత్మీయ వీడ్కోలు పలకనుండగా.. ఇంద్రకీలాద్రి వద్ద కృష్ణా (Krishna) జిల్లా నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర వేళ.. వైసీపీ నుంచి భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది.
ఈ క్రమంలో బెజవాడ పసుపుమయంగా మారింది. పార్టీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర దాదాపు 5 రోజులపాటు సాగనుంది. ప్రకాశం బ్యారేజి(Prakasam Barrage) మీదుగా జిల్లాలోకి లోకేశ్ రానుండటంతో స్వాగత ఫ్లెక్సీలతో బ్యారేజీ నిండిపోయింది. పాదయాత్ర సాగే మార్గం మొత్తం భారీ ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారులు, వైసీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.