Electric Shock: ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు.. విద్యుత్ తీగలు మీద పడి ఒకరు మృతి - బాపట్ల జిల్లాలో విద్యుత్ ప్రమాదంతో తండ్రి మృతి
Current Shock: పల్నాడు జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. అభిమాన నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా.. ఫ్లెక్సీలు కడుతూ విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లాలో పోలేరమ్మ తిరునాళ్లలో విద్యుత్ తీగలు మీద పడి ఓ వ్యక్తి మరణించాడు. యువకుల మరణంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట మండలం మోపువారిపాలెం గ్రామానికి చెందిన నక్కా వెంకటేష్, బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన పోలూరి సాయి.. అభిమాన నటుడైన హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. శనివారం రాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా.. ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ పైనున్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో వారిద్దరూ విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతలు నరసరావుపేటలోని వేర్వేరు ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదువుకుంటున్నారు.
బాపట్ల జిల్లాలో విద్యుత్ ప్రమాదంతో తండ్రి మరణించగా.. కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చీరాల మండలం గవినివారిపాలెంలో పోలేరమ్మ తిరునాళ్లు నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాక్టరుపై డీజే బాక్సులు కట్టి ఊరేగిస్తున్నారు. ఈ క్రమంతో ట్రాక్టర్ విద్యుత్ స్తంబానికి తగలటంతో.. విద్యుత్ తీగలు తెగి సమీపంలో ఉన్న.. మల్లవరపు చినఅంకన్న, అతని కుమారుడు గోపిచంద్పై పడ్డాయి. చినఅంకన్న ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. గోపిచంద్‌ను మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.