Women Agitation with Empty Buckets : తాగునీటి సమస్యపై మహిళల ఆగ్రహం.. ఖాళీ బిందెలతో సచివాలయం ముట్టడి - Drinking water problem in Annamaiya district
Women Agitation with Empty Buckets for Drinking Water in front of Sachivalayam in Sri SathyaSai District : తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం సచివాలయాన్ని మహిళలు ముట్టడించారు. గ్రామంలో గత నెల రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా సచివాలయ సిబ్బంది, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో సచివాలయాన్ని ముట్టడించారు. అధికారులు సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆరోపించారు. నీటి సమస్య పరిష్కరించాకే సిబ్బంది బయటకు వెళ్లాలంటూ సచివాలయం ముందు వారు ఆందోళన చేపట్టారు. అల్ప విద్యుత్ సమస్యతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వల్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోందని సచివాలయ సిబ్బంది నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. చాలా రోజుల తరబడి తాగునీరు సరఫరా కాకపోతే ఎలా ఉండాలంటూ మహిళలు అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు.