అధికార పార్టీ అయితే ఓటు హక్కు ఓకే - టీడీపీపై సానుభూతి ఉంటే ఇక అంతే!
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 9:18 PM IST
Votes cancellation in Narasaraopet: ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒకచోటే ఒక ఓటే ఉంటుంది. పొరపాటున ఒకటికి మించి ఓట్లు ఉన్నా వాటిని తొలగించాలి. కానీ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రం ఇది మినహాయింపు అన్నట్లుగా కనిపిస్తోంది. అధికార పార్టీ సానుభూతిపరులకు ఒకటికి మించి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉన్నట్లు నిరుపించినా.. యంత్రాంగం చూస్తూ మిన్నకుండిపోతుందే తప్ప ఆ ఓట్లను తొలగించే సాహసం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అదే విపక్ష పార్టీలకు చెందిన వారికి పొరపాటున ఎక్కడైనా రెండు చోట్ల ఓటు ఉందని తెలిస్తే... బీఎల్వీలు తమ పరిశీలనలో గుర్తించినా.. వారి దృష్టికి అధికార నేతలు ఎవరైనా తీసుకెళ్లినా.. ఆగమేఘాల మీద రెండో ఓటు తొలగించటానికి ఫారం-7 దరఖాస్తులు చేయటం పరిపాటిగా ఉంటోంది.
బాపట్ల జిల్లా పర్చూరులో పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులకు చెందిన 14 వేల పై చిలుకు ఓట్లకు ఫారం-7 కిందకు తీసుకువచ్చారు. వీటిల్లో అత్యధిక దరఖాస్తులు అధికార పార్టీ నాయకులు చేసినవే. ఈ అక్రమాలు ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న అద్దంకి నియోజకవర్గంలోనూ అధికారపార్టీకి మేలు చేయాలని అధికార యంత్రాంగమే భావిస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాలకు చెందిన ఓటర్లకు ఇక్కడ ఓటు హక్కు కల్పించటం అధికారుల తీరు తేటతెల్లం చేస్తోంది. బల్లికురవ మండలం కొప్పెరపాలెం గ్రామానికి చెందిన పలువురు వ్యాపార, ఇతరత్రా పనులపై ఊరు విడిచి ఎప్పుడో నరసరావుపేట, చిలకలూరి పేటకు వెళ్లి అక్కడే నివాసాలు ఉంటున్నారు. అలాంటి వారి ఓట్లను గత పంచాయతీ ఎన్నికల సమయంలోనే గ్రామానికి చెందిన తెలుగుదేశం నేతలు గుర్తించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఓట్లు తొలగించాలని కోరారు. అప్పట్లో స్పందించకపోయినా కనీసం ఓటర్ల ముసాయిదా జాబితా తయారీ సమయంలో అయినా... గుర్తించి తొలగిస్తారనుకుంటే ఆ పని చేయలేదు. అధికారులు తొలగించడం లేదని చెప్పి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వారి పేరుతో ఆధారాలతో సహా ఫారం-7లు 25 మందిపై దరఖాస్తు చేశారు. ఇంకా మరికొందరు ఉన్నారని తెలిసింది. కనీసం ఇప్పుడు కూడా వారి ఓట్లు తొలగించటానికి అధికారులు సాహసించడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.