దళితులంతా 'వి హేట్ జగన్' అంటూ నినదిస్తున్నారు: వర్ల రామయ్య - టీడీపీ వి హేట్ జగన్ కార్యక్రమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 3:34 PM IST
Varla Ramaiah fires on CM Jagan: రాష్ట్రంలో దళితులంతా వి హేట్ జగన్ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయిన రోజు నుంచి దళితులపై వరుసగా 6వేలకు పైగా దాడులు జరిగాయని పేర్కొన్నారు. వివిధ సందర్భంలో జరిగిన దాడుల్లో మెుత్తం 28మంది చనిపోయారని వర్ల రామయ్య ఆరోపించారు. సామాజిక బస్సు యాత్రలో తరిమికొడతారని దళిత పల్లెల్లోకి వెళ్లే ధైర్యం వైసీపీ నాయకులు చేయట్లేదని వర్ల ఎద్దేవా చేశారు. నంద్యాలలో దళిత న్యాయవాది విజయ్ కుమార్‌పై వైసీపీ నేతల దాష్టీకం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడిపైనే ఎదురు కేసు పెట్టడం నీచాతి నీచమని వర్ల రామయ్య విమర్శించారు.
జగన్ ప్రభుత్వం ముందు దళిత నేతలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని వర్ల రామయ్య మండిపడ్డారు. దళిత వర్గాలను హింసించిన వారిపై ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఒక్కరిపై కేసు పెట్టలేదని విమర్శించారు. వైసీపీ దళితులను వివిధ కార్పొరేషన్ల పేరుతో మోసం చేసిందని వెల్లడించారు. ఇన్ని కార్పొరేషన్లు పెట్టినా.. ఒక్కరికైనా ప్రయోజనం చేకూరిందా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు జరిగిన న్యాయం, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన న్యాయంపై సొంతపార్టీ నేతలే చెబుతారని వర్ల విమర్శించారు. అంబేడ్కర్ విదేశీ విద్య పేరును తీసి వైఎస్ జగన్ పెట్టినప్పుడే జగన్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని వర్ల పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా దళితులకు వేల ఎకరాల భూములను ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క ఎకరం అయినా పంచి పట్టారా అంటూ ఎద్దేవా చేశారు.