Building Collapse: కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. అందరూ చూస్తుండగానే
Two Floors building Collapse in Anakapally: అందరూ చూస్తుండగానే అనకాపల్లిలోని ఓ రెండతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నగరంలోని పెరుగు బజారు రహదారి విస్తరణ పనులు నిర్వహిస్తుండగా ఈ భవనం నెలకొరిగింది. పెరుగు బజారు నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులను జీవీఎంసీ అధికారులు చేపట్టి.. 50 అడుగుల మేర రహదారిని విస్తరిస్తున్నారు. విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలను తొలగించాలని యాజమానులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఓ భవనాన్ని 10 అడుగుల మేర తొలగించాల్సి వచ్చింది. ఆ భవన యాజమాని భవనం పూర్తిగా దెబ్బతినకుండా.. పది అడుగుల వరకే కూల్చటానికి ప్రయత్నించాడు. కూల్చాలనుకున్న దాన్ని 10 అడుగుల వరకే మార్కింగ్ ఇచ్చి.. మిగతా భవనానికి సంబంధం లేకుండా గోడలు తొలగించాడు. ప్రొక్లెయిన్ సహాయంతో 10 అడుగుల మేర భవనాన్ని తొలగించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ భవనంలోని కింది భాగాన్ని తొలగిస్తుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ దృశ్యాలు చూడటానికి భూకంపం వచ్చి భవనం కుప్పకూలినట్లుగా కనిపించాయి.