నాలుగేళ్లలో 120 సంక్షేమ పథకాల రద్దు ఘనత మీదే : సీఎం జగన్‌కు టీడీపీ నేతల బహిరంగ లేఖ - TDP Letter
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 7:23 PM IST
TDP Leaders Open Letter to CM Jagan:తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు.. కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, ఎం.ఎ.షరీఫ్, గుమ్మడి సంధ్యారాణిలు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో దారి మళ్లించిన కోట్ల రూపాయల నిధులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
లేఖలో ఏం రాశారంటే?.. ''టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తే, ప్రస్తుతం వారి కాళ్లు విరిచి కట్టు కట్టి మహానుభావులుగా ప్రచారం చేసుకుంటున్నారు. రూ.3లక్షలు సబ్సిడీతో ఇచ్చిన ఇన్నోవా కార్ల పథకం రద్దు చేసి, వాహన మిత్ర పేరుతో డ్రైవరుకు రూ.10వేలు ఇచ్చి, రెండోవైపు డీజిల్, మద్యం రేట్లు పెంచారు. పోలీస్, ఆర్టీవో జరిమానాలు.. గ్రీన్ ట్యాక్స్ పెంచి ఒక్కో డ్రైవర్ నుండి ఏడాదికి ఒక రూ.లక్ష గుంజుకుంటున్నారు. చేతి వృత్తుల వారికి పనిముట్లు అందించి ఆదాయం పెంచే పథకాన్ని రద్దు చేశారు. మటన్ మార్టులు, చేపల కొట్లు, 217 జీవోతో వృత్తుల వారి ఉపాధిని దెబ్బతీస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను 53 నెలలుగా సొంత కాళ్లపై నిలబడకుండా చేసి, ఇప్పుడు బస్సు యాత్రల పేరుతో నయవంచన చేస్తున్నది నిజం కాదా..?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించడం వాస్తవం కాదా..?. అన్న క్యాంటీన్, నిరుద్యోగ భృతి లాంటి 120 సంక్షేమ పథకాలు రద్దు చేయడం వారిని అణగదొక్కడం నిజం కాదా..?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కబ్జా చేసేందుకు కుట్రలు చేస్తుండడం వాస్తవం కాదా..?'' అని లేఖలో నిలదీశారు.