'వైసీపీ అయితే ఓకే, టీడీపీ అయితే తీసేయ్!' దొంగ ఓట్లతో నెగ్గాలనుకుంటున్నారు : కొండబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 1:55 PM IST
TDP Leaders Complaint To Collector: కాకినాడ నగరంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్లు అధికారులు వ్యవహరిస్తూ.. తమ వారి ఓట్లను తొలగించారని తెలుగుదేశం నేత కొండబాబు మండిపడ్డారు. ఓటమి భయంతో కేవలం దొంగ ఓట్లతోనే నెగ్గాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఓట్లను తొలగించేలా జగన్ కుట్రపన్నుతున్నారని కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో ఓటర్ల లిస్ట్‌ను సరిచేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని తెలిపారు.
ఓటర్ల జాబితా విషయాన్ని కలెక్టర్ కృతికా శుక్లా దృష్టికు తీసుకెళ్లి, ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వైసీపీ కి చెందిన వారి ఓటర్లలో డెత్‌లు ఉన్నా తొలగించడం లేదని ఆరోపించారు. డబుల్ ఎంట్రీలు... మైగ్రేషన్ వారున్నా అసలు తొలగించడం లేదని కొండబాబు మండిపడ్డారు. ఓట్ల అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆన్సర్ ఉండదని తెలిపారు. వైసీపీ నేతల ఓట్ల అక్రమాలపై పూర్తి వివరాలను కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.