ప్రత్తిపాటి ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 3:01 PM IST
TDP Leader Prattipati Pullarao New Year Celebrations: నవ్యాంధ్ర చరిత్రలో 2024 నూతన సంవత్సరం నవశకానికి నాంది కాబోతోందన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. కష్టాలు, పేదరికంలేని ఆ నవ సమాజం దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా అందరికీ కొండంత అండ కానుందన్నారు. సోమవారం గుంటూరులోని ఆయన నివాసంలో నూతన సంవత్సర సంబరాలు భారీ ఎత్తున నిర్వహించారు. కిక్కిరిసిన పార్టీ కార్యకర్తలు, నాయకుల సందోహం మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి అడుగులో తోడుగా ఉండే ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున స్థానికులూ తరలివచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు తీసుకుని వచ్చిన కేకులు కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రత్తిపాటి.
అనంతరం వారందరి సమక్షంలోనే 2024 క్యాలెండర్లను ఆవిష్కరించారు. అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీమంత్రి ప్రత్తిపాటి కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. త్వరలో రానున్న చంద్రన్న పాలనలో అందరికీ ఏ డోకా లేకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది అన్నారు ప్రత్తిపాటి. నాయకులు, కార్యకర్తలంతా ఎన్నికల్లో ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ నాయకత్వంలో నూతన శకానికి ఆరంభంగా 2024 చరిత్రలో నిలిచిపోవాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు.