Jawahar Fires on Jagan డీఎస్సీలు వేయరు.. ఉన్న వారిని సర్దుబాటు చేస్తూ.. ఉన్నత విద్య లక్ష్యాలు ఎలా సాధ్యం! - new education policy
TDP Leader Jawahar Comments on Jagan: ఉపాధ్యాయుల సర్దుబాటుతో జగన్ విద్యావ్యవస్థను నడపాలనుకోవటం సరికాదని మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. డీఎస్సీలు నిర్వహించకుండా టోఫెల్ ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ప్రపంచస్థాయి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు గాను ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) అనే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇంగ్లీష్ భాషా సామర్థ్యాలను పరీక్షించేందుకు అంతర్జాతీయ ఆంగ్ల పోటీ పరీక్ష.. టోఫెల్. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విమర్శలు గుప్పించారు.
ఇంగ్లీషు మీడియంతో విద్యావ్యవస్థను జగన్ గందరగోళానికి గురిచేశాడని ఆరోపించారు. పాఠశాల విద్య.. విలీనంతో నాశనమయిందని మండిపడ్డారు. జాతీయ నూతన విద్యావిధానం కేవలం జగన్‌కే పరిమితమైందని జవహర్ విమర్శించారు. నూతన విద్యావిధానం లోపభూయిష్టమని పేర్కొన్నారు.
పరిశోధన దశలోనే జగన్ అమలు చేయాలనుకోవటం అజ్ఞానమన్నారు. చర్చలు సంప్రదింపులు లేకుండా వ్యవస్థను నిర్వీర్యం చేయలనుకుంటున్నాడని మండిపడ్డారు. ఎయిడెడ్ వ్యవస్థను పూర్తిగా మూసేశారని, కళాశాల విద్య కనుమరుగవుతుందని అన్నారు. జగన్ ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్మూలన చేయలనుకోవటం సరికాదని జవహర్ హితవుపలికారు.