Simhadri Appanna: కన్నుల పండువగా సింహాద్రి అప్పన్న స్వర్ణపుష్పార్చన - భక్తి వార్తలు
Simhadri Appanna Swarna Pushparchana: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో స్వర్ణపుష్పార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించిన అనంతరం స్వర్ణపుష్పార్చన ఉత్సవం నిర్వహించారు. స్వామివారిని తెల్లవారు జామున సుప్రభాత సేవతో మేల్కొలిపిన అనంతరం.. శ్రీ గోవింద రాజు స్వామి వారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాంగ సుందరంగా అలకరించారు. ఆలయ కల్యాణ మండపములో వేద మంత్రాల నడుము మంగళవాయిద్యాలతో స్వామి వారి సేవలను అర్చకులు కన్నుల పండువగా నిర్వహించారు. వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా 108 బంగారు సంపెంగ పుష్పాలతో కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. భక్తులు స్వామివారిపై తమ భక్తిని వివిధ రూపాల్లో కనబర్చారు. ఈ ఆర్జిత సేవకు భక్తుల నుంచి విశేషంగా ఆదరణ లభించింది. దీంతో ముందుగా పేరు నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.