Somireddy on AP Liquor Sales: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై విచారణ జరిపించేలా పురందేశ్వరి చొరవ తీసుకోవాలి : సోమిరెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 6:41 PM IST
Somireddy on AP Liquor Sales: ఏపీలో మద్యం కుంభకోణంపై విచారణ జరిపించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. చొరవ తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. మద్యం అమ్మకాల్లో భారీ దోపిడీ జరుగుతోందని, నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రాణాలు తీస్తూ.. దోపిడీ చేస్తూ.. జగనన్న సురక్ష అంటూ ప్రజల వద్దకు వెళ్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ ప్రజల ముందుకు వెళ్లే అర్హత వైసీపీ నాయకులకు ఉందా అని విమర్శలు గుప్పించారు.
వైసీపీ నాయకులకు చెందిన మద్యం బ్రాండ్లనే మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచుతున్నారని ఆరోపించారు. ఏడాదికి సుమారు 7కోట్ల రూపాయలు లెక్కల్లో లేవని.. ఇలా నాలుగేళ్లకు కలిపి 28వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకానికి లెక్కలే లేవన్నారు. ఏపీ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ వెబ్సైట్ను ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సిసోడియా సహా చాలా మంది జైళ్లల్లో మగ్గుతున్నారని.. ఈడీ, సీబీఐలకు ఏపీలో జరుగుతున్న మద్యం కుంభకోణం కనిపించదా అని ప్రశ్నించారు. రాజకీయాలు పక్కన పెట్టి.. రాష్ట్రంలో మద్యం దోపిడీ, నాసిరకం మద్యాన్ని అరికట్టాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.