ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. శివధనుర్భంగాలంకారంలో రాములోరు - శివధనుర్భంగాలంకారం
ONTIMITTA BRAHMOTSAVALU : వైఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం స్వామి వారు శివధనుర్భంగాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. సీతా స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మను వరించే ఘట్టాన్ని గుర్తు చేసేదే ఈ శివధనుర్భంగాలంకారం. ఉదయం 8 గంటల నుంచి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాల చెక్కభజనలు, కేరళ డ్రమ్స్, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
నేడు కల్యాణం: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి సీతారాముల కల్యాణం జరగనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీటీడీ సిద్ధం చేసింది. 52 ఎకరాల విస్తీర్ణంలోని శాశ్వత కల్యాణ వేదికలో దాదాపు లక్షమంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్యాణాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు వేద పండితులు రాజేశ్ కుమార్ భట్టార్ సమక్షంలో కల్యాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. పురాణాల ప్రకారం పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా శ్రీరాముడు రాత్రి సమయంలో కల్యాణం చేసుకుంటారని వేద పండితులు చెబుతున్నారు.